పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ రెండు దురుణాలు వివేకాన్ని నాశం చేస్తాయి. ఇంకా, మనకు తాత్కాలిక లాభం కలిగినాకూడ మోసం, అబద్ధం, కపటం మొదలైనవాటికి పాల్పడకూడదు. "సత్యమేవ జయతే" అన్న సూక్తిని నమ్మి అన్నివేళలా నిజాయితీని పాటించాలి. చిత్తశుద్ధిలేనివాడికి నిజమైన వివేకం వుండదు.

3. కొందరు తమ ఇష్టానిష్టాలకూ రాగద్వేషాలకూ పక్షపాతవైఖరికీ సులభంగా లొంగిపోతూంటారు. సత్యాన్నీ న్యాయాన్నీ లెక్కచేయరు. ఈలాంటివాళ్లు ఏ నిర్ణయం చేసికొన్నా తమకు అనుకూలంగానే చేసికొంటారు. సహజంగానే వీళ్లు అవివేకమనే బురదలో దిగబడిపోతారు. ఈలాంటివాళ్ళు దైవసాన్నిధ్యంలో నిలచి, అందరి హృదయాలు తెలిసినవాడూ న్యాయాధిపతిఐన దేవునికి భయపడి మంచి నిర్ణయాలు చేసికోవడం నేర్చుకోవాలి. ఇంకా తొందరపాటు, ఒకసారి చేసికొన్న నిర్ణయాలను చీటికిమాటికి మార్చుకోవడం మొదలైన దుర్గుణాలను చక్కదిద్దుకోవాలి.

4. కొందరు సమస్య ఎదురైనపుడు ఏ నిర్ణయానికీ రాలేరు. అటూఇటూ తేల్చుకోకుండా అలాగే జాప్యంచేసూ వుండిపోతారు. వీళ్ళు పదిమందిమీద అధికారులుగావుండి బృందం కార్యాలను నడిపింపవలసిన వాళ్లయితే మరీ చిక్కులు వస్తాయి. ఈలాంటివాళ్ళ నిపుణులు సలహాలను పొందాలి. ఓ సమస్యనుగూర్చి సకాలంలో తగిన నిర్ణయానికి రావడం జీవితంలో అందరికి అవసరమే.

5. మనం వివేకం అలవర్చుకొనేది ప్రధానంగా క్రీస్తు బోధలనుండీ, అతని చర్యలనుండీని. అతని బోధలన్నీ, కార్యాలన్నీ వివేకంతో కూడివుంటాయి. కనుక ఆ ప్రభువు జీవితాన్ని ప్రార్థనాపూర్వకంగా మననం జేసికొంటూ మనం కూడ ఈ పుణ్యాన్ని పెంపొందించుకోవాలి. సువిశేషాలను భక్తితో చదువుకొని క్రీస్తు అద్భుతాలూ, బోధలు, సామెతలూ అతడు ఆనాటి జనంతో మెలిగిన తీరూ మొదలైనవాటిని జాగ్రత్తగా గమనించాలి.

ఈ పుణ్యాన్ని పెంపొందించుకోవాలంటే ఆత్మ సహాయంకూడ అత్యవసరం. ఒకవైపు పిశాచంబిడ్డల్ని పిశాచం నడిపిస్తూంటే, మరోవైపు దేవుని బిడ్డల్ని దేవుని ఆత్మ నడిపిస్తూంటుంది - రోమా 8,14. కనుక మనలను నిరంతరం వివేకమార్గాల్లో నడిపించమని ఆ యాత్మను అడుగుకోవాలి. ఆ యాత్మ మన మనసులో పుట్టించే మంచి కోరికలద్వారా మనలను సన్మార్గాల్లో నడిపిస్తూంటుంది. పైగా, ఆత్మ మనకు దయచేసే సప్తవరాల్లో “సదుపదేశం” ఒకటి. ఆ వరం మనలోని నైతికపుణ్యమైన వివేకాన్ని బలపరుస్తుంది.

దేవమాతను "మంచి ఆలోచనయొక్క మాతా" అని సంబోధిస్తాం. ఆ తల్లిని అడుగుకొంటే ఆమె మనకు తప్పకుండా మంచి ఆలోచనలను పుట్టిస్తుంది. ఈలాగే