పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లొంగిపోగూడదు. అపోహలకు తావీయకూడదు. సత్యప్రీతి అవసరం. ఏ పక్షాన బలమైన కారణాలు కన్పిస్తే ఆ పక్షాన్నే ఎన్నుకోవాలి. సమస్యను మనకు చేతనైనంతవరకు నిశితంగా అర్థంచేసికొని సత్యప్రీతితో చేసికొన్న నిర్ణయాన్ని దేవుడుకూడ ఆశీర్వదిస్తాడు. మూడవది, మనం చేసికొన్న నిర్ణయాన్ని కార్యరూపేణ సాధించడానికి పూనుకోవాలి. కార్యాచరణంలో ఎదురయ్యే అవరోధాలను ముందుగానే పసికట్టాలి. ఆ యాటంకాలను దాటే మార్గాలనుగూడ తెలిసికోవాలి. అవసరమైన వాళ్ళనుండి సహాయాన్ని పొందాలి. లక్ష్యాన్ని సాధించేదాకా విసుగూ విరామమూ లేకుండా కృషి చేయాలి. కొందరు మంచి నిర్ణయాలే చేసికొంటారుగాని కార్యానికి మాత్రం వుపక్రమించరు. ఈలాగైతే విజయం సిద్ధించదు. పూవులు కాయలుగా మారినట్లే హృదయంలోని కోరికలు కార్యాలుగా రూపొందాలి, వివేకం చాల విస్తృతమైన పుణ్యం. అది మనంచేసే అన్ని సత్కార్యాల్లోకి ప్రవేశిస్తుంది. మనం ఆచరించే అన్ని పుణ్యాలను నడిపిస్తుంది. వివేకంతో చేయందే ఏ సత్కార్యమూ ఫలించదు. అందుచేత అది ఓ ప్రత్యేక అనడంకంటె అన్ని పుణ్యాలనూ ఫలభరింతం చేసే విశాల అనడం మేలు.

2. వివేకం ఆవశ్యకత

నిత్యజీవితంలో వివేకం అత్యవసరం. మనం నిరంతరం పాపపు లోకంలో జీవిస్తూంటాం. ఇతరుల దుష్టచేష్టలు మనలనుగూడ పాపానికి పురికొల్పుతాయి. వివేకంగలవాడు ఈ పాపకార్యాలనుండి కొంతవరకైనా తప్పకొంటాడు. ఈ గుణం లేనివాడు పాపప్రవాహంలోబడి కొట్టుకొనిపోతాడు. ఒక్క పాపవిసర్జనకేగాదు, పుణ్యార్ధనకుగూడ వివేకం అవసరం. పుణ్యాలనే రథమెక్కి మనం మోక్షానికి పయనిస్తాం. కాని ఈ రథసారథి వివేకమే. వివేకమే లేకపోతే మనం ఎప్పడు ఏ పుణ్యాన్ని ఎంతవరకు ఆచరించాలో తెలియక పొరపాట్లు చేస్తాం. ఉదాహరణకు తోడి నరుల సేవలో అతిగా శ్రమించి ఆరోగ్యాన్ని చెడగొట్టుకొనేవాళ్ళన్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందేమోనన్న భయంతో తాము చేయవలసిన సేవలు కూడ చేయక సోమరులై పోయేవాళ్ళకూడ వున్నారు. ఇవి రెండూ అవివేక ప్రవర్తనలే. వివేకం ఈ రెండు వర్గాలవాళ్ళను సవరించి వాళ్ళు తోడివారికి చేయవలసినంత సేవ చేసేలా చేస్తుంది. ప్రేషిత సేవ చేసే గురువులు మఠకన్యలు మొదలైనవాళ్ళకు ఈ పుణ్యం అత్యవసరం. గురువు ప్రసంగంలో చెప్పగూడని విషయాలు చెప్పకూడదు, జ్ఞానోపదేశం బోదించే వాళ్ళు అనవసరవిషయాలు చెప్పకూడదు. గురువు ప్రజల పాపోచ్చారణం వినేప్పడు ఈ గుణం అత్యవసరం. అలాగే సాంఘిక సేవా కార్యక్రమాలు నడిపించేపుడు గూడాను.