పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3. ఆత్మ దిగిరావడం - అ,చ. 2,1-4

శిష్యులు యెరూషలేములో సమావేశమై ఓ మేడ గదిలో ప్రార్థన చేసికుంటూ వుండగా పరిశుద్దాత్మ దిగివచ్చింది. ఆత్మ దిగివచ్చినపుడు అగ్నీ వాయువూ ప్రత్యక్షమయ్యాయి. ఇవి రెండూ పూర్వవేదంలో భగవత్సాక్షాత్కారాన్ని సూచిస్తుంటాయి. హోరెబు పర్వతంమీద ప్రవక్త యేలీయాకు దేవుడు కనిపించినపుడు పెనుగాలి వీచింది, నిప్ప మంటలు లేచాయి - 1రాజు 19, 11-15. సీనాయి పర్వతంమీద ప్రభువు మోషేకు సాక్షాత్కారమయినపుడూ ఉరుములు మెరపులు పొగమంటలు కనుపించాయి. కనుక ఇక్కడ యీ గుర్తులు దేవుడు మళ్లీ దిగి వస్తున్నాడని, దేవునికీ మానవులకూ మధ్య మరో నిబంధనం జరుగబోతుందని సూచిస్తాయి. శిష్యులు పరిశుద్ధాత్మను పొంది నానా భాషల్లో మాటలాడారు. అక్కడ పండుగ కోసమై గుమిగూడిన జనులుగూడ శిష్యులు మాటలాడే భాషలను అర్థం చేసికున్నారు. ఈ బహుభాషా జ్ఞానంగూడా పరిశుద్దాత్మ యిచ్చే వరాల్లో వొకటి. ఈ సంఘటనకు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే యోవేలు అనే ప్రవక్త పవిత్రాత్మనుగూర్చి ప్రవచనం పలికాడు. ఈ ప్రవచనం ప్రకారం"కడపటి దినాలు వచ్చినపుడు నరులందరిమీద నా యాత్మను కుమ్మరిస్తాను" అన్నాడు ప్రభువు. ప్రభువు ఆనతిచ్చిన విధంగానే యిక్కడ పవిత్రాత్మ దిగివచ్చింది. అ. చ 2, 16-18. ఆనాడు శిష్యులు పొందిన ఆత్మనే ఈనాడు మనమూ పొందుతున్నాం.

4. శిష్యులు పూర్తిగా మారిపోయారు - అచ. 2, 22-24

శిష్యులు ప్రభువుతో కలసి జీవించారు. ప్రభువు అద్భుతాలు చూచారు, బోధలు విన్నారు. ఐనా వాళ్లల్లో పెద్దమార్పేమీ కలుగలేదు. క్రీస్తు వెళ్లిపోయాకగూడ అతన్ని వాళ్లు అర్థం చేసికోలేదు. కాని, ఆలాంటివాళుకూడ పవిత్రాత్మ దిగి రాగానే పూర్తిగా మారిపోయారు. ప్రభువు తన మరణోత్థానాల ద్వారా పాప క్షమాపణం చేకూర్చి పెట్టాడని తెలిసికున్నారు. యావే ప్రభువు క్రీస్తును పరలోక భూలోకాలకు ప్రభువుగా నియమించి రక్షణ కర్తగా ప్రకటించాడని అర్థం చేసికున్నారు. ఈ విషయాలనే పేత్రు యెరూషలేములో బాహాటంగా బోధించాడు, అంతకుముందు ఓ బానిసపిల్లకు భయపడి క్రీస్తును అంగీకరించడానికి వెనుకాడిన యీ పేత్రు యెరూషలేం వీధుల్లో క్రీస్తే ప్రభువని ధైర్యంగా ప్రకటింపసాగాడు. 145