పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/152

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4. పరిశుద్ధాత్మ

బైబులు భాష్యం -1

1. ప్రభువు వాగ్దానం - యోహా 16,7

ప్రభువు శిష్యులను వీడి మోక్షానికి వెడలి పోకముందే పరిశుద్ధాత్మను పంపిస్తానని వాగ్దానం చేసాడు. ఈ వచ్చే ఆత్మ పేరు "ఆదరణకర్త". అనగా ఈ యాత్మ శిష్యులను హెచ్చరిస్తుంది, ప్రోత్సహిస్తుంది, ఓదారుస్తుంది, ఆదరిస్తుంది. ఈయాత్మ వచ్చినపుడు శిష్యులను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది - యో 16,18. ఈ సర్వసత్యం క్రీస్తే, కనుక ఆత్మ శిష్యులు క్రీస్తును అర్థం చేసికునేలా చేస్తుంది. వాళ్ల క్రీస్తు సిలువ మరణాన్ని గ్రహించేటట్ల సహాయపడుతుంది. క్రీస్తును ప్రేమించేలా చేస్తుంది. ఈనాడు మనలనుగూడ క్రీస్తువైపు ఆకర్షించేది, మనమూ క్రీస్తును ప్రేమించేలా చేసేది ఈ ఆత్మే.

2. శిష్యులకు అర్థంకాలేదు - అ.చ. 1,6.

ప్రభువు రక్షణ ప్రణాళికను ముగించుకొని మోక్షానికి ఆరోహణంగావడం కోసమై పర్వతానికి వెళ్లాడు. ఆ చివరి గడియల్లో శిష్యులు "ప్రభూ! యిస్రాయేలు రాజ్యానికి స్వాతంత్ర్యం ఇప్పించవా" అని అడిగారు. ఆ రోజుల్లో పాలస్తీనా రోమను సామ్రాజ్యం అధీనంలో వుండేది. మెస్సియా వచ్చి పాలస్తీనా దేశానికి దాస్య విముక్తి కలిగిస్తాడని కొందరు యూదులు భావించేవాళ్లు, శిష్యులు క్రీస్తే మెస్సియా అని నమ్మారు. కనుక ఈ క్రీస్తు పాలస్తీనా దేశానికి స్వాతంత్ర్యం ఇప్పిస్తాడని వాళ్ల నమ్మకం, అందుకే వాళ్లు ఈలా అడిగింది.

కాని వాళ్లు ప్రభువును అర్థం చేసుకోలేదు. ప్రభువు సాధించిన రక్షణ కార్యంగూడ వాళ్లకు బోధపడలేదు. అంతకు ముందే పిలాతుని యెదుట ప్రభువు "నా రాజ్యం ఈ లోకసంబంధమైంది కాదు? అన్నాడు. కాని ఈ పలుకులేవీ వాళ్ల చెవికి ఎక్కలేదు. శిష్యులు క్రీస్తు అద్భుతాలు కండార చూచారు. బోధలు చెవులార విన్నారు. ఐనా క్రీస్తు ఉత్తానమయ్యేపుడుకూడ అతడు సాధించిన కార్యమేమిటో వాళ్లకు తెలిసిందికాదు. అసలు క్రీస్తు మనుష్య రక్షణాన్ని సాధించాడనైనా వాళ్లు ఊహించలేదు. మరి వాళ్లకు కనువిప్ప కలిగించింది ఎవరు? క్రీస్తుగాదు, క్రీస్తు బోధలు గాదు, అద్భుతాలు గాదు. పరిశుద్దాత్మ మనంగూడ ఆత్మ సహాయం లేందే దైవసత్యాలను గ్రహించలేం. బైబులు అర్థం చేసికోలేం.