పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8) పర్యవేక్షకులు, పరిపాలకులు, సహాయకులు, కాపరులు - ఈ వరాలన్నీ సమాజ కార్యనిర్వహణకు సంబంధించినవి. ఈ వరాలు కలవాళ్ళ ప్రజలను ప్రోగుజేసి కార్యక్రమాలు నిర్వర్తిస్తారు, అధికారులుగా మెలుగుతారు, ఉద్యమాలు నడుపుతారు.
9) భాషకులు - ఈ వరంలో ప్రధానాంశం అన్యభాషల్లో మాట్లాడ్డం కాదు, ప్రభుని స్తుతించడం. కనుక ఇది ఓ ప్రార్ధనావరం. ఒకోమారు ఇది రెండు వరాలుగా పనిచేస్తుంది. ఒకరు అజ్ఞాత భాషలో ప్రభుని స్తుతింపగా మరియొకరు దాని అర్థం తెలియజేస్తారు. పై వాటిల్లో భాషలు, వివేచనం ప్రవచనం ప్రేషితులు అనే వరాలను మీదటి వ్యాసాల్లో విపులంగా వివరించి చెప్తాం.

5. ఈ వరాలు వ్యక్తి లాభంకోసంగాదు, సమాజ లాభంకోసం అని చెప్పాం. పౌలు ఇవి క్రీస్తు దేహనిర్మాణంకొరకు ఉద్దేశింపబడినవి అని చెప్పాడు - ఎఫే 4, 12. అనగా వీటితో మనం క్రైస్తవ సమాజాలకు సేవచేసి వాటిని వృద్ధిలోకి తీసికొనిరావాలి.

విశ్వాసం, ప్రేమ, నమ్మిక అనే వరాలు పుణ్యాత్ముల్లో మాత్రమే వుంటాయి. కాని ఈ సేవావరాలు పాపాత్ముల్లో కూడ వుండవచ్చు -మత్త 7, 15-28. కనుక వీటి విలువ చాల స్వల్పం. మనకు తెలియక ఈ వరాలు కలవాళ్ళను ఘనంగా ఎంచుతాం. కాని వ్యాధులు నయంచేయడం, దయ్యాలను పారద్రోలడం మొదలైన అద్భుతాలు చేయడంకంటె సోదరప్రేమతో జీవించడం గొప్ప

6. ఇక మనకందరికీ ఈ వరాలున్నాయా? పరిశుద్దాత్మ అందరికీ ఏవో కొన్ని వరాలిస్తుంది - 1కొ 12,7. పౌలు తన నాటి క్రైస్తవ సమాజాల్లోని వరాలను కొన్నిటిని పేర్కొన్నాడు. నేటి మన సమాజానికి ఇంకా వేరే వరాలు కూడ అవసరం. కనుక నేటి యవసరాలను పరస్కరించుకొని ఆత్మ ఈనాటి క్రైస్తవులకు వివిధ వరాలనిస్తుంది. ఈనాడు మనకు విశేషంగా కావలసింది సమాజ చైతన్యం, సమాజ సేవ, సమాజనాయకత్వం. పేదప్రజలకు జరిగే సాంఘిక అన్యాయాన్ని అరికట్టి వాళ్ళకు మేలుచేయడం నేటి యవసరం. ఈ యక్కరలకు అనుగుణంగా ఆత్మనేటి క్రైస్తవులకు ప్రత్యేక వరాలనిస్తుంది.

కాని ముఖ్యాంశ మేమిటంటే, భక్తులు ఒక్కొక్కరూ ఆత్మ తమకు ప్రత్యేకంగా యిచ్చిన వరాలేమిటివో పరిశీలించి చూచుకోవాలి. అనగా మన శక్తిసామర్థ్యాలూ, అభిరుచులూ, అవకాశాలూ ఏమిటివో గుర్తించాలి. ఇవే మన ప్రత్యేక వరాలు. ఈ వరాలను వినియోగించుకొంటూ మనం క్రైస్తవ సమాజాభివృద్ధికి కృషిచేయాలి. ఇదే మన సేవ - 1షేత్రు 4, 10-11. మన గురువులూ మఠకన్యలూ గృహస్టుల ప్రత్యేక వరాలను అణచివేయగూడదుగదా, వాటినింకా వృద్ధిలోకి తీసికొని రావాలి.