పుట:Bible Bhashya Samputavali Volume 02 Bible Bodhanalu P Jojayya 2003 281 P.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గూర్చి అంత విపులంగా వివరించి చెప్పలేదు. కావున వీటి స్వభావం ఈనాడు మనకు అంత స్పష్టంగా బోధపడదు. ఇక వీటిని గూర్చిన కొలదిపాటి వివరణం :

1) అపోస్తలులు, ప్రవక్తలు, బోధకులు, సువార్తకారులు - ఈ మొదలైన వన్నీ క్రైస్తవ మతబోధకులకు సంబంధించిన వరాలు. ఈ వరాలతో భక్తులు క్రైస్తవ సత్యాలను క్షుణ్ణంగా అర్థంచేసి కొని వాటిని ఇతరులకు కూడ బోధిస్తారు. గ్రంథాలు వెలువరిస్తారు. బుద్ధి, జ్ఞానం అనే వరాలు కూడ ఈ రంగానికి చెందినవే. వీటి ద్వారా మన మతసత్యాలను లోతుగా ఆలోచించి చూచే శక్తి కలుగుతుంది.
2) స్వస్థత - ఈ వరం తొలినాటి క్రైస్తవ సమాజంలో విరివిగా వుండేది. నేడు ప్రోటస్టెంటు సమాజాల్లో కొందరికి ఈ వరమున్నట్లుగా తెలుస్తుంది. ఇటీవల మన క్యాతలిక్ సమాజంలో ఈ వుద్యమం ప్రచారంలోకి వచ్చాక మన ప్రజల్లో కూడ కొందరు ఆరోగ్యదానం చేసేవాళ్ళు కన్పిస్తున్నారు.
3) ప్రోత్సాహం అంటే తోడిజనాన్ని మతవిషయాల్లో ప్రోత్సహించడం. ఓదార్చి హెచ్చరించడం.
4) పరిచర్య అంటే తోడి ప్రజలకు రకరకాల రూపాల్లో సేవలు చేయడం. విద్యాసేవ, వైద్యసేవ, సాంఘికసేవ మొదలైనవి ఈ వరానికి సంబంధించినవే. దానం అంటే మన కున్న సిరిసంపదలను పేదలకు పంచి యిూయడం. కరుణ కార్యాలు కూడ పై పరిచర్యలాంటివే. విశేషంగా పేద సాదలనూ కష్ఠాల్లో వున్నవాళ్ళనూ వ్యాధి గ్రస్తులనూ ఆదుకోవడం. ఈ వరం వల్ల బాధపడేవాళ్ళపట్ల మనకు కనికరమూ సానుభూతీ కలుగుతుంది. ఈ జాలిగుణంతో మనం ఇతరులకు తోడ్పడతాం. క్రీస్తులో ఈ గుణం సమృద్ధిగా వుండేది - మత్త 11, 28-30.
5) విశ్వాసం - ఈ వరం వల్ల ప్రభువు మనకు మేలు చేస్తాడనీ మన వ్యాధిబాధలను తొలగిస్తాడనీ నమ్ముతాం. ఇది తరచుగా ఆరోగ్యదానానికీ అద్భుతాలకూ సంబంధించింది. అనగా ప్రభువు ఇప్పుడు ఈ వ్యక్తికి వ్యాధి తొలగిస్తాడని నమ్ముతాం.
6) వివేచనం - మనలను పవిత్రాత్మే నడిపిస్తుందో అపవిత్రాత్మే నడిపిస్తుందో తెలిసికొనే శక్తి. ఈ వరంవల్ల ఉచితానుచితాలను గ్రహించి వివేకంతో ప్రవర్తిస్తాం.
7) ప్రవచనం - ఇది ప్రభు సందేశాన్ని విన్పించే వరం. పెంతెకోస్తు సమావేశాల్లో కొందరు భక్తులు ఈవర సహాయంతో ప్రభు చిత్తాన్ని తెలియజెప్మంటారు. ఈవరం సమృద్ధిగా కలవాళ్ళే ప్రవక్తలు.