పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయిదవ ప్రకరణము

లండనులోని యనుభవములు

వయస్సులోనున్న బెంజమిను రాల్ఫు ఇరువురు వారమునకు మూడురూప్యము లద్దె నిచ్చుటకు నిర్ణయించుకొని, 'లిటిలు బ్రిటను' వీధిలో నొక బసను బుచ్చుకొనిరి. వీరొకరి నొకరు విడువ లేక యుండిరి. బెంజమినుచే బోషింపబడుచున్నందున, నితనిని విడుచుటకు రాల్ఫుకు వీలు లేక పోయెను. తనకంటె తక్కువ వాడైనను, స్వారస్యముగ మాటలాడువాడని రాల్ఫును బెంజమిను ప్రేమించుచుండెను. 50 సంవత్సరములు గడిచిన పిదప, రాల్ఫును బోలిన రసికుని చూచి యెఱుగ నని బెంజమిను చెప్పెను. బెంజమిను నెమ్మదిగలవాడును, మాటలలో వెనుకదీయువాడును, గాంభీర్యముతో దనపనిని జూచుకొనువాడును, చూచుట కింపైన, వాడును, పెద్దపిన్న తారతమ్యముకలవాడై, మాటల నేర్పుగలిగి, లౌకిక వ్యాపారాభివృద్ధిని గోరువాడు రాల్ఫు. వీలయినచో వీరిరువురిలో, రాల్ఫె గొప్పవా డగు నని వీరిని జూచినవారు చెప్పియుందురు.