పుట:Balavyakaranamu018417mbp.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేత వంటకము వండఁబడియె. వండఁబడియె ననఁగా వంట చేయఁబడియెనని యర్థము. చేయుటం కాశ్రయుఁడగుటం జేసి దేవదత్తుండు కర్తయయ్యె.

4. చేతవర్ణకంబు హేతుకరణంబులకు, గ్రహ్యాదియోగజంబగు పంచమికిని బహుళంబుగా నగు.

ఫలసాధనయోగ్యం బగు పదార్థంబు హేతువు. క్రియాసిద్ధిం బ్రకృష్టోపకారంబు కరణంబు. హేతువునకు: ధనముచేత సౌఖ్యంబు గలుగు. విద్యచేత యశంబు గలుగు. పక్షంబున వలన వర్ణకంబగు. కరణంబునకు: ఖడ్గంబుచేత ఖండించె, కోలచేతఁ గూలనేసె. పక్షంబున దోడవర్ణకంబగు. గ్రహ్యాది యోగంబునందు: జరాసంధుఁడు రాజులచేతఁ గప్పంబు గొనియె. మైత్రుండు చైత్రునిచేత ఋణంబు గొనియె. ఈ యర్థంబులు నీచేత నెఱింగితి. ఈ వృత్తాంతంబు వానిచేత వింటి. పక్షంబున వలన వర్ణకంబగు. ఇత్యాదికంబు లెఱుంగునది.

5. కరణ సహార్థ తుల్యార్థయోగంబులం దృతీయకుం దోడవర్ణకం బగు.

కరణంబునందు: కోలతోడఁగూలనేసె. సహార్థంబునందు: రాజు సేనలతోడ వచ్చె - సేనాసహితుండయి వచ్చెనని యర్థము. తుల్యార్థ యోగంబునందు: చైత్రుని తోడ మైత్రుండు తుల్యుండు. తృతీయకనుటంజేసి చైత్రునకు మైత్రుండు తుల్యుండని తుల్యార్థయోగంబున షష్ఠియునగు.