పుట:Andhrulacharitramu-part3.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుద్ధము చేసి జయించినందున గఠారినాయడని బిరుదమును వహించెనని సింగభూపాలీయములోని యొక శ్లోకము వెలుగోటి వంశచరిత్రమునందు నుదాహరింపబడినది. కానీ నాగానాయనికి గఠారిరాయడనియు, రావుత్తురాయడనియు బిరుదములున్నట్లుగా జెప్పెనేకాని యతడనవేమారెడ్డితో యుద్ధము చేసి జయించినట్లు చెప్పియుండలేదు. కావున నాగానాయ డనవేమారెడ్డిని జయించినది విశ్వసనీయము కాదు[1].

రెండవ ప్రకరణము
అనపోతభూపాలుని దిగ్విజయములు
(క్రీ.శ 1344 మొదలు క్రీ.శ 1380)

రేచెర్ల సింగమనాయని మరణానంతర మాతని జ్యేష్ఠపుత్త్రుడైన అనపోతనాయడు తన తండ్రిని రాచవారక్రమముగా జంపించిరని సక్రోధుడై పగబూని విజృంభించి తనతండ్రి యాజ్ఞానుసారముగా దిగ్విజయము ప్రారంభించి క్షత్రియ సంహారమునకు గడంగి సాత్రవుల రక్తముతో దండ్రికి దిలతర్పణము గావింపవలయు నని గాఢ ప్రతిజ్ఞ జేసి చతురంగ సేనా పరివృతుడై వీరశిఖామణి యగు తమ్ముడు మాదానాయడు వెంట నంటి రా యసంఖ్యాకములగు సైన్యములతో బోయి

  1. శ్లో. శ్రీమా వేచమహీపతి న్సుచరితో యస్యానుజన్మా స్ఫుటం
    ప్రాప్తో వీరగురుప్రథాం పృధుతరాం వీరస్య ముద్రాకర
    లబ్ధ్వాలబ్ధ్వకఠారిరాయబిరుదం రావుతితురాయాన్వితం
    పుత్త్రం నాగయనాయకం వసుమతీవీరైకచూడామణిమ్.