పుట:Andhraveerulupar025958mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రంగమున నిర్జించి జీవగ్రాహిగజేకొని పశుధనముతో జయలక్ష్మితో బితృరాజ్యమున కేగుదెంచు వార్తనాలకించి మాధవశర్మయు సిరియాలదేవియు సంతోషితాంతరంగులై కుమారుని ప్రజ్ఞాదికముల కానందించుచు, నిజనివాసమునుండి బయలువెడలి, కందారమునకు మునుముందె చేరి మాధవవర్మకు సుస్వాగతము నొసంగిరి. వినయముతో మాధవవర్మ సిరియాలదేవికి, మాధవశర్మకు నమస్కరించి విజయాదికము నంతయు నివేదించెను. వారిరువురు తనయు నాశీర్వదించి శుభముహూర్తమున బితృరాజ్యము మాధవవర్మకు బట్టాభిషేకము నిర్ణయించిరి. పురవాస్తవ్యులు పట్టరాని సంతసముతో సోమరాజుతనయుడు మఱల రాజ్యమునకు వచ్చుట శుభసూచకమని సహస్రభంగుల నానందించిరి. సర్వసంపత్సమృద్ధమగు నాకందారపురమును బౌరులు చక్కగ నలంకరించి పట్టాభిషేక సుదినమునకై ప్రతీక్షించుచుండిరి. సకాలమునకు బంధోన్ముక్తులగు రాజన్యులగు బశుధనమును జేకొని ప్రధానులు, సైనికులు, కందారరాజ్యమునకు జేరిరి. రాజ్యమునకు సంబంధించిన సర్వగ్రామములనుండి వేదవేదాంగ వేత్తలగు బ్రాహ్మణోత్తములు, సంగీత సాహిత్యవేత్తలు, వినోదజ్ఞులు, రాజకార్యధురంధరులు రావింప బడిరి.

సర్వ శాస్త్ర వేత్త యగు మాధవశర్మ యాగమానుసారముగ మంత్రముల బఠించి శాస్త్రోక్తముగ మాధవ