పుట:Andhraveerulupar025958mbp.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాజ్యమును మునుముందు బరిపాలింపదగిన వంశాంకురమా లేదు. ప్రత్యర్థియా! బలవంతుడై హృదయ శల్యమువలె బ్రవర్తించుచున్నాడు. ఆందోళనమున స్తబ్ధముగ నున్న యాతనిహృదయము కర్తవ్యము నిర్ణయింప నేరదయ్యెను. కటకేశ్వరు డేనాడెత్తివచ్చునో యను యోచన యతని హృదయమును గలచివేసెను. సిరియాలదేవి తన వీరోచితోపదేశములచే నాతని చిత్తవృత్తి చాలవఱకు సవరించి మఱల సంగరాభిముఖుని గావింప సహస్రభంగుల బ్రయత్నము చేసెను. సోమరా జా వీరపత్ని యుద్బోధనము శిరసావహించి కొంతకాలమున కమితమగు బలమును సమకూర్చుకొని కటకేశ్వరునిపైకి బయలువెడలెను. అంతకుమున్నె కందారమునకు బ్రయాణమగుచున్న కటకేశ్వరుడు మార్గమధ్యముననె సోమభూపాలకుని బలముతో బ్రతిఘటించి పోరాడెను. రెండుమాసము లుభయసైన్యములకు సమమగు సంగ్రామము జరిగెను. ఇరువాగులయందు బేరునకెక్కిన వీరులనేకులు నశించిరి. కటకరాజన్యునకు నాహారవస్తువులు, ఆయుధములు, సైనికులు, కావలసినంత ధనము కటకమునుండి వచ్చుచుండెను. సోమరాజున కట్టి సహాయము తటస్థింపదయ్యెను. కందారము మిగుల దూరముగనుంటచే నటనుండి మంత్రులెట్టి సహాయము నాయవస్థలో రాజన్యునకు చేయజాలరైరి. గ్రహచారవశమున సోమరాజు సైన్యమున కాహారవస్తువులైపోయెను.