పుట:Andhraveerulupar025958mbp.pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వృద్ధికి సహకారులైరి. వీరిలో మల్లసేనాని విద్యాప్రియుడు. ఎఱ్ఱాప్రగడ మహాకవి నీ మల్లసేనాని తొలుత దన యాస్థానము నందు గవిగా నుంచికొని గౌరవించి చిరకాలము పోషించి పిదప వేమభూపాలకుని ప్రాపకమునందు జేర్చెను. సముద్రతీరమునందున్న కురుమలూరునం దీమల్లారెడ్డి నివసించి ద్వీపాంతరముల నుండి పడవలపైవచ్చు విదేశవస్తువులకు సుంకములు నిర్ణయించుచు నుండెను. ఈయన కవితాభిమానము గలవాడు గాన మిగుల బ్రశంసాపాత్రుడు. వేమారెడ్డి రాజ్యము పాలించు సమయమున మోటుపల్లి గొప్ప రేవుపట్టణముగా నుండెను. కాకతీయరాజు లచట శుల్కాధికారి నుంచి దిగుమతి సరకులకు బన్నులువిధించి శాసనశిలలను బ్రాతించిరి. వేమారెడ్డి యాజ్ఞను బురస్కరించుకొని సోదరుడగు మల్లారెడ్డి అపరిమిత పరివారసహితుడై విరోధిహస్తగతమై యున్న మోటుపల్లిని జయించెను. అది మొదలు రెడ్డిసామ్రాజ్యమునకు సుంకముల వలన మితిలేని యాదాయము వచ్చుచుండెను. నూకారెడ్డి ధరణికోట ప్రాంతములనుండి వెలమవీరులగు అనపోతానాయకుడు, మాదానాయకుడు ముందునకు రాకుండ బలుమాఱు నిలువరించెను. కటకాధీశ్వరుడగు గజపతిని కృష్ణ కావలనే యెదిరించి వెనుకకు బాఱదోలెను. వేమారెడ్డి శివభక్తుడైనను వైషమ్యభావమును విడచి శివకేశవ దేవాలయములు ప్రతిష్ఠించుటయే గాక యన్నింటికి సమానముగా