పుట:AndhraRachaitaluVol1.djvu/432

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వలన సంఘసంస్కరణోద్యమము వేళాకోళము లోనికి దిగి దేశమున కుపకృతికిమాఱు అపకృతియే ఘటిల్లె" ననియు, "కన్యాశుల్క మసలు నాటకమే కా" దనియు గొన్ని విమర్శనములు లోకములో నున్నవి. ప్రకృతమున కవి యక్కఱలేని సంగతులు. మన మొకటి యనుకొన వచ్చును. 'కన్యాశుల్కము' సాంఘికముగాబెద్ద విప్లవమేమియు గలిగింప జాలలేదుగాని, భాషావిషయకముగా గిడుగువారి వాదమునకు మూదల యైనది. 'కన్యాశుల్కము' సంఘములో గూడ మంచి సంస్కృతి నిచ్చినదని యన్నచో నేను కాదనను. ఆ రచన, పాత్రపోషణము, ఆ జాతీయములు, ఆ సంవిధానము 'కన్యాశుల్కము' ను తెలుగు వారి జీవితములతో నభిన్నమును జేసివైచినవి. గిరీశము-రామప్పంతులు-కరకటశాస్త్రి-మధురవాణి వీరందఱు అప్పారావుగారి ధర్మమా యని చరిత్ర పురుషులు పురాణపురుషులుగా నయిపోయిరి. ఆయన కలములో నట్టి పాటవ మున్నది. కన్యాశుల్కము తరువాత వేదమువారి ప్రతాపరుద్రీయము కొంత ఖ్యాతిగడించుకొన్నది. ఎవరెన్ని వ్రాయనిండు! అప్పారావుగారిదే యావిషయమున నగ్రస్థానము.


కాగా, నవ్యకవిత్వమునకు 'నాండి' పాఠము చేసినకవి అప్పారావుగారే యని నూతన కవుల వ్యవహారము. "వై తాళికులను" మేలుకొలిపినవా డనియు, మార్గదర్శియనియు, చక్కని వాడుకాభాషను ప్రవేశపెట్టి ముత్యాలసరాలు కూర్చి భాషకు శాశ్వతోపకారము చేసిన వాడనియు నేటివారికి గురుజాడకవిమీద మంచి ప్రత్యయ మున్నది. "కొత్తపాటలమేలు కలయిక కొమ్మెఱుంగులు చిమ్మగా" వీరి కవిత యువకహృదయముల గదలంచినది. క్రొత్తతీరు వృత్తములైన ముత్యాలసరములతో దెలుగునాట నొక సంచలనము రేగినది. అప్పారాయకవి నాశ్రయముగా జేసికొని బసవరాజు, అధికార్లవారు మున్నుగా గేయములు పాడజొచ్చినారు. కథారూపముగా విషయము ప్రబోధించి దేశభక్తిని పుట్టించుటకు వీరి ముత్యాలసరములు తగినటు లుండును.