పుట:AndhraRachaitaluVol1.djvu/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పసితనముననే తండ్రిని బాసినవాడని కడుగారాబమున బెంపబడెను. పదునైదేండ్లు వచ్చుదాక వేటమీదను, ఆటలమీదను గల వేడుక విద్యపై లేదు. "తమ్మనదొరగారికి దప్పి పుట్టితివి నాయనా!" అని యొక పెద్దమానిసి వీధి బోవుచు నన్నమాట శూలపు బోటై. సూర్యప్రసాదరావుగారు వెంటనే యింటికిబోయి తన బుద్ధి చదువు బాటపై నడిపించెను. మనోరథము మంచిది గాన దమ యింటి పండితుడు శ్రీ ముక్కవిల్లి సాంబయశాస్త్రిగారి సారథ్యముతో నడక చఱ చఱ సాగినది.

గురుదేవులు సాంబయశాస్త్రిగారిని గుఱిచి ప్రసాదరాయ కవి "మృతజీవి జీవితామృతము" లో గనబఱిచిన భక్తి గౌరవ మీ పద్యములలో నారయగలరు.

మ. హరి భక్తుండను శేముషీ గురుడు నీ యాస్థాన విద్వత్కవీ

శ్వరుడౌ సాంబయశాస్త్రి ముక్కవిలి వంశ స్వచ్ఛ రత్నమ్ము మ

ద్గురుడైనాడు సుమయ్య! యయ్యనఘు గన్గొన్నప్డు నిన్గన్న యా

దరమున్ భక్తియు గల్గు దమ్మయ విభూ! తండ్రి! కవిగ్రామణీ!

మ. పదునై దేండుల యీడు వచ్చుదనుకన్ బాలో చితక్రీడలం

జదువుల్ మాని చరించునాకు గవితాసక్తిం బ్రసాదించి యొ

ప్పిదమౌదారికి ద్రిప్పి తా జదువుచెప్పెన్ మద్గురుండెందు నం

త దయాళుండు గలాడె తమ్మయ విభూ! తండ్రీ! కవిగ్రామణీ!

మ. ధన మీవిచ్చితిగాని యాతడిడు విద్యాబుద్ధులే నాకు నీ

ధన సంపత్తికి మీఱి కీర్తియు మహత్సమ్మానముంగూర్చె, న

య్యనఘు న్నన్ను దలంప నెక్కు డతడేయౌ, గాని, నాకట్టియా

తని నీవిచ్చితి గాదె తమ్మయ విభూ! తండ్రి! కవిగ్రామణీ