త్రిపురాన వేంకట సూర్యప్రసాదరాయకవి
1889 - 1945
తెలగా వంశీయుడు. తల్లి: నారాయణమ్మ. తండ్రి: తమ్మయ్య దొర. జన్మస్థానము: శ్రీకాకుళము తాలూకాలోని సిద్ధాంతము. జననము: 1889 అక్టోబరు 31 తేదీ. నిర్యాణము: 1945. ముద్రిత కృతులు: 1. నిర్వచన కుమారసంభవము (6 ఆశ్వాసములు. 1913 ముద్రి.) 2. రఘూదయము (4 ఆశ్వా. 1924 ముద్రి.) 3. రతి విలాపము (ద్విపద కావ్యము 1926 ముద్రి.) 4. మొయిలు రాయబారము (కాళిదాసుని మేఘ సందేశమునకు స్వతంత్ర దేశీయ గేయానువాదము. 1940 ముద్రి.) ఆముద్రితములు: 1. నిర్వచన రఘువంశము (శ్లోకమునకు బద్యముగా దెనిగించినది. 19 సర్గములు) 2. ఇందుమతీ మందారము (అజ చరిత్రము) 3. ఉత్తరరామ చరిత్రము (భవభూతి నాటకమునకాంధ్రీకృతి) 4. కిరాతార్జునీయము (భారతికి బద్యాంధ్రీకరణము) 5. అజవిలాపము (ద్విపద ఇది ' భారతి ' లో ప్రకటించిరి) 6. మృతజీవి జీవితామృతము (తమ్మయవిభూ! తండ్రీ! కవిగ్రామణీ! " అను మకుటముతో దండ్రిగారి జివితచరిత్ర ప్రతిబింబునట్లు వ్రాయబడిన చిన్నగ్రంథము) 7. శ్రీరామాశ్వమేధము (పద్మపురానములోని పాతాళఖండము, ఇది యసంపూర్ణము) 8. శ్రీభగవద్గీతామృతము (దేశీయచ్ఛందో గీతికలలో ద్విపాత్రనాటికగా రచింపబడినది).
శ్రీ సూర్యప్రసాదరాయకవి త్రిపురాన తమ్మయరాట్కవీంద్రునకు దగిన తనయుడు. ఇంకను కొడుకు కళాప్రపూర్ణుడు కాలేదు, సరిగా బదునాలుగు నెలలేని నిండలేదు. తమ్మయకవి భగవదాజ్ఞకు బద్ధుడయ్యెను. పాండితిలో గవితలో వీరి రచనములను బట్టి పరికించినవారికి 'పుత్రాదిచ్ఛేత్పరాజయ' మ్మనిపించును. సూర్యప్రసాదరావుగారి జననం 1889 లో. ఆయనకేమి ? పరులకడకు బోయి చేచాపనక్కఱలేకుండ, స్వేచ్ఛగా దిని చేతులార నింత పెట్టుకొను శ్రీమంతుల వంగడములో బుట్టెను.