పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“దగ్గరకు రాగానే జాగరసుందరి అయి ఊరుకొన్నదా?”

“వెఱ్ఱిప్రశ్నలు వేయక వెంటనే ఉపాయం ఆలోచించు.”

“చిత్తం, ఆలోచిస్తున్నా. ఆలోచిందా; ఆలోచించడమేమిటి ఆచరణలో పెట్టినాను.”

“ఏమిటది?”

“రాజకుమారిక కడకు దారిలో రెండు సింహిక లుండేవి. అవి లేవు ప్రస్తుతము. ఇప్పుడున్న సింహికలు మన విషయంలో వట్టి మార్జాలికలు.”

“అంటే?”

“మనం నగలవర్తకులుగా ఆమెకడకు వెళ్ళే వీలు ఏర్పాటు చేస్తాయా మార్జాలికలు.”

“మనకు అంతఃపురాలన్నీ ఇక నివృతద్వారాలే.”

“సరే. నీ చేతిలో ఉన్నాను.”

“జారిపోకుండా ఉండండి. నేను చెప్పిన పాఠాలు మరవకండి. కొంపలు మునిగిపోతాయి."

ఈ యిరువురు మన పాతమిత్రులే అని పఠితలు గ్రహించే ఉంటారు.

7

ఈ నూత్న వర్తకచక్రవర్తి వినోదకునితో ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారిని గూర్చి మాట్లాడిన అయిదు దినాలకు శాంతిశ్రీ రాకుమారి వినయపీఠికల చదువుకుంటూ తన విద్యామందిరంలో కూర్చుండి ఉన్నది. ఇంతలో దౌవారిక ఒకతె ఇద్దరు వర్తకులను మందిర ముఖద్వారానికి లోని భాగంలో నిలుచుండబెట్టి చదువు కొంటున్న రాకుమారి దగ్గరకుపోయి “జయము జయము భరృదారికా! వారు వచ్చినారు” అని విన్నవించెను. “ఎవరే?” అని రాకుమారి తన పీఠమునుండి లేచి ద్వారమువైపు చూచినది. “ఎవరువీరు?” అని ఆ బాలిక కనుబొమలు ముడివడ ఆ దౌవారికను ప్రశ్నించింది. “నగలవర్తకులా? నగలవర్తకు లిక్కడి కెందుకు వచ్చినారు?”

“తమకు నగలు చూపించడానికండి”

“నాకు నగలు చూపించడమేమిటి! నేను చూడనని నీకు తెలియదా?” ఆమె కొంచెం విసువు కనబర్చింది.

“తమతో మనవిచేసి తమ అనుమతిపొందే తీసుకవచ్చానండి.” ,

ఇంతలో వణిక్కుమారులిమంత్రి రాజకుమారికవైపు తిరిగి రెండు చేతులు జోడించి, “మహారాజకుమారీ! మేము విదేశాలనుండి వచ్చిన వర్తకులము. మా దగ్గర ఉన్న నగలూ, నవరత్నాలూ, బంగారమూ రెండుమూడు వందలకోట్ల సువర్ణ ఫణాల వెల చేస్తాయి. సువర్ణగిరిలో ఉన్న మా కేంద్ర స్థానంలో ఉన్న నగలూ మొదలైన వాని మూల్యం ఎన్ని కోట్లుంటుందో మాకే తెలియదు. మహారాజులైన ఇక్ష్వాకు శాంతిమూల మహాప్రభువుల అంతఃపుర దేవేరులు రాజకుమారీమణులు మేము తెచ్చిన భూషణాలన్నీ తీసుకొని మమ్ము సన్మానిస్తారనే ఆశతో మీ మహానగరం వచ్చినాము. మహారాణిగారు మూడు లక్షణ ఫణాల నగలు పుచ్చుకొన్నారు” అని మనవిచేసి తలవంచుకొన్నాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

84

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)