పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏమీ మాట్లాడకుండా ఆ వర్తక కుమారుడు శాంతిశ్రీ రాకుమారిని కళ్ళతో కబళిస్తూ నిలుచున్నాడు. శాంతిశ్రీకి ఏమీ అర్థంకాలేదు. చిన్నబిడ్డవలె తెల్లబోయి చూచింది వారిరువురివైపూ. దౌవారికమాత్రం అక్కడనుంచి మాయమైపోయింది. ఏమీ తోచక రాజకుమారి పదిలిప్త లలా ఉండి వెంటనే అక్కడనుంచి తలవంచుకొని వేరొక ద్వారంగుండా తన ప్రార్థనామందిరానికి వెళ్ళిపోయింది.

వర్తకులిద్దరూ ఆశ్చర్యంతో ఒకరి మొగమొకరు చూచుకున్నారు. వారిని తీసుకొని వచ్చిన దౌవారిక ఎక్కడనుంచి వచ్చిందో అక్కడకు పెదవులకడ వేలుంచుకొని, వారిని తనతో రండని తీసుకొని పోయింది. కక్ష్యాంతరాలు గడుస్తూ రాకుమారిభవనాలు రక్షించే మహాకుడ్య గోపురం దాటి బయటపడ్డారు. ఆ బాలిక వారిద్దరనీ గోపురద్వారం బయటవదలి, తిరిగి లోనికి పోయినది.

ఆమె లోనికి వెళ్ళగానే ఒక ప్రతీహారిణివచ్చి “రాజకుమారిగారు సభామందిరంలో ఉన్నారు, నిన్ను రమ్మంటున్నారు” అని దౌవారికతో చెప్పింది. సభామందిరంలో దౌవారిక వెళ్ళగానే, అక్కడ మహారాజ కుమారి సభ తీరిచి ఉన్నది. అంతఃపురపాలకురాలు మహారాజకుమారి ప్రక్క ఒక ఆసనంమీద కూర్చునిఉంది. ఒక ప్రక్కగా బారులుతీర్చి, నలుగురయిదుగురు ప్రతీహారిణులు, పదిమంది దౌవారికలు, ఎనమండుగురు అంగరక్షకు రాండ్రు దాసీజనమూ, ముగ్గురు చెలికత్తెలు నిలిచి ఉన్నారు. వీరందరినీ చూడగానే ఆ దౌవారికకు ప్రాణాలు క్రుంగిపోయాయి.

అంతఃపురపాలకురాలు (ఏభైఏళ్ళుంటాయి): ఏమి బౌగ్దాయినీ, ఎవరినీ వర్తకులను తీసుకొని వచ్చినవావుట?

బౌద్దాయని: కా - కాదమ్మా! నేను రాకుమారి గారి అనుమతిమీదనే తీసుకొని వచ్చినాను.

అంతః: అనుమతిపొందే తీసుకొని వచ్చి ఉండవచ్చు. కాని విద్యామందిరంలోకి ఎందుకు తీసుకవచ్చావు? అమ్మగారిని చూడడానికి పురుషులెవరైనా వస్తే, నాకు తెలియజేయవద్దూ?

బౌద్దాయని: చిత్తం! కాని ఆవర్తకులు మహారాణులు మొదలయిన వారికే నగలు, నవరత్నాలూ అమ్ముతారు. వారికి చాలా తొందరపని ఉండటంచేత, విద్యామందిరానికి తీసుకొని వెళ్ళాను. తమతో మనవిచేసి తమ అనుమతి పొందడానికి వ్యవధి లేకపోయింది.

అంతః: తీసుకొని వచ్చినావు, బాగానే వుంది. ఆ వెంటనే నా దగ్గరకు వచ్చి ఎందుకు చెప్పినావు కావు?

బౌద్దా: చిత్తం ఆ వర్తకులను సాగనంపడానికి వెళ్ళానండి.

అంతః: ఆ వర్తకులను విద్యామందిరంలో దిగబెట్టగానే నువ్వు ఆ మందిరం వదలివచ్చి పైన నిలుచుని వున్నావు. అప్పుడు వచ్చి చెప్పలేదేం?

ఆ దౌవారిక మౌనం వహించింది.

అంతః: దుర్మార్గులారా! నువ్వు ఆ వర్తకుల దగ్గర కొంతధనం బహుమానం పుచ్చుకొని లోనికి తీసుకొని వచ్చావు అంతవరకూ నాకు తెలిసింది. సరే, నిజం చెప్పు. ఎవరా వర్తకులు. మహారాజుకుమారికను చూడ అవసరం ఏమి కలిగింది?

అడివి బాపిరాజు రచనలు - 6

85

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)