పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఉదయమే నాయనగారు నా మందిరానకు వచ్చి నన్ను తమ అంతఃపురానికి తీసుకొని వచ్చినారు. అటూఇటూ తిరిగినాను. ఆలోచనామందిరానికి వచ్చినాను.”

బ్రహ్మదత్తునికి తా నాబాలికను మొదటిసారి చూడడం ఆ మందిరంలోనే అన్న విషయం హృదయాన ప్రత్యక్షమయింది. “ఏమిటి ఈ రెండు సంఘటనలకూ అర్థం ?” అనుకున్నాడు ధనక ప్రభువు.

వెనక ఈ స్కందవిశాఖాయనక ప్రభువును ఈ మందిరంలో కలుసుకొనడానికే తన తండ్రిగారు రప్పించినారు. అప్పుడే వారు తనకు గురువగుటకు నిశ్చయింపబడినది. ఈమధ్య కొంచె మెచ్చు తగ్గుగా సంవత్సరంనుండి వీరి దేశికత్వము తనకు తప్పిపోయింది. మరల ఆ దేశికత్వమును కొనసాగించడానికి మహారాజుగారు తన్ను రప్పించినారు కాబోలు అని రాజకుమారి అనుకున్నది. ఈ ప్రభువు జ్ఞానసముద్రుడు అవి ఆ బాలిక తన మనస్సున ఒప్పుకొన్నది. స్వభావముచే ఆమె జిజ్ఞాసువు. ఈ ధనక ప్రభువు బోధనా కుశలుడని ఆమె గ్రహించింది. వీరికి అడవి అనే ఉపనామ మెందుకు వచ్చిందో! వీరి పూర్వులు అడవి ప్రదేశాలు శాతవాహనులకోసం జయించడంవల్ల వచ్చి ఉంటుంది అనుకొన్నది.

అడవి ఎంత విచిత్రమైనది! అడవిలో ఎన్నిలక్షల జాతుల చెట్లు లతలు, నికుంజాలు, ఓషధులు, ముళ్ళమొక్కలు ఉంటాయి. లక్షలకొలది జంతువులు భయంకరమైనవి, సాధువైనవి, క్రూరమైనవి అడవిలో వాసం చేస్తాయి. మనుష్యులను, ప్రాణికోట్లను బ్రతికించేవి, నాశనం చేసేవి ఓషధులు మొదలయినవి ఉంటాయి అడవిలో. నదులా అడవులలో ప్రవహిస్తాయి. చినచిన్న సెలయేరులు, చెరువులు ఆ అడవులలో ఉంటాయట. అడవులు దావానలంవల్ల మండిపోతూ ఉంటాయట. మనుష్యులను కబళించే రాక్షసులు అడవులలో ఉంటారట. పిశాచులు, శాకినీ, ఢాకినీ మొదలుయిన క్షుద్రదేవతలు అడవులలో వాసంచేస్తూ ఉంటారుట.

అయినా ఈ ప్రభుకుటుంబానికి “అడవి” అని బిరుదనామం వచ్చింది. కాని అడవిలో మహర్షులు జ్ఞానం సంపాదించినారు. ఆ అడవులలో అనేక బౌద్ధసన్యాసులు ఆశ్రమాలు నిర్మించారు. ఈ విజయపురం నిర్మాణం కాకముందు ఇదంతా అడవే. నాగార్జునదేవుని ఆశ్రమం ఏర్పడిన తర్వాతనే ఈ విజయపురి వెలసిందంటారు. ఎంత భయంకరమైనా అడవి దివ్యమూ పవిత్రమూ అంటారు. ఈ అడవి బ్రహ్మదత్తప్రభువుకూడా దివ్యుడూ, పవిత్రుడూ.

ఈ ఆలోచన మనస్సులోతట్టి “ప్రభూ! తాము నాకు మరల చదువు ఎప్పుడు ప్రారంభిస్తారు?” అని శాంతిశ్రీ రాకుమారి ఆయనను అడిగింది. స్కందవిశాఖాయనక ప్రభువు ఆశ్చర్యంలో మునిగిపోయినాడు. ఈ రాజకుమారీయేనా ఈ మాటలన్నది? ఈమెకు చదువంటే ఇష్టంకూడా ఉన్నది! బలవంతంచేసి చెప్పిన చదువై నా మహాజ్ఞాపశక్తి కలది అవడంచేత జ్ఞాపకం ఉంచుకోగలదు. కాని చదువంటే కాంక్ష ఉంటుం దీమెకు అవి ఆ ప్రభువు అనుకోలేదు.

“రాజకుమారీ! మీకు చదువులందు కుతూహలం ఉంటే నేనెప్పుడూ సిద్దమే.”

అడివి బాపిరాజు రచనలు - 6

78

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)