పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తనమెడలో దండ వేయడమే సంఘటనా? బాలికలంతా తనతో “మన్మథుడు నిన్ను రతీదేవిగా ఎన్నుకొన్నాడు” అని చెప్పినారు.

రతీదేవిగా ఎన్నుకోడంలో అర్థం చాలా ఉందనికదా తాను విన్నది? మన్మథునిగా ఎన్నుకొన్న పురుషుడు, ఒక స్త్రీని రతీదేవిగా ఎన్నుకొంటే ఆమెను తన భార్యగా వరించినట్లు అనీ, ఆ బాలికకు ఆ పురుషునియందు ఎంత ఇష్టములేకపోయినా, ఆ పురుషుడు కోరినట్లయితే అతని భార్య అయి తీరాలని తన తల్లిగారయిన మహారాణి చెప్పినారు. వివాహం అంటే వైదిక ధర్మము ననుసరించి స్త్రీ పురుషులు ఇరువురు కలిసి గృహస్థాశ్రమం నడపుట అని శాస్త్రాలు చెప్పుతున్నాయి.

శాంతిశ్రీ శాస్త్రపఠన కుశల. అవి ఆమెకు బుద్దిస్థమైనవేకాని అనుభవానికి రాలేదు. చిన్న బిడ్డలకు ప్రేమ అంటే ఏమిటో తెలుసును. తల్లి ముద్దు పెట్టుకుంటే శిశువు ఆనందం వెలిబుచ్చుతుంది. శిశువులకు పంతం ఉంది గంతులు వేస్తారు. బాలబాలికలు నవ్వుతారు. ఏడుస్తారు. పౌరుషం సిగ్గు అన్నీ ఉంటాయి వారికి. చిన్నతనాన్నుంచీ శాంతిశ్రీకి ఇవి ఏమీ తెలియవు. పదినెలల శిశువుగా ఉప్నప్పుడు చిటికవేసి నవ్విస్తే నవ్వేదికాదు. వెఱ్ఱిబిడ్డ అని అనుకునేందుకు వీలులేదని పండితులన్నారు.

శాంతిమూల మహారాజు దైవజ్ఞులకూ, పండితులకూ, ఆర్యఋషులకూ, బౌద్దార్హతులకూ తన బాలిక జాతకము చూపించినారు. వైద్యులచేత ఆ బాలికను పరీక్ష చేయించినారు. అందరు ఈమె ఒక విచిత్ర శిశువన్నారు. శాంతిశ్రీ ఆనాటి వసంతోత్సవం నుండి మరీ మౌనవ్రతం తాల్చింది. ఆమె ఎవరితోను మాట్లాడుట మానివేసింది. తండ్రితో, బౌద్దచార్యులతో ఏవో రెండు మూడు మాటలు అత్యవసరమైనవి అంటుంది. ఆమె ప్రార్ధన చేస్తుంది. ఆ ప్రార్ధనలో ఆమె పులకరింపు ఎరుగదు. ఉద్వేగము లేదు. మహారాజు బ్రహ్మదత్త ప్రభువుకు వసంతోత్సవంలో రతీదేవి నిర్ణయవిషయం సూచించలేదు. మంత్రులకు, రాజపురోహితులకు ఏమీ తెలియదు.

ఇంతలో శాంతిమూలమహారాజు, స్కందవిశాఖాయనక బ్రహ్మదత్త ప్రభువూ ధాన్యకటకనగరం వెళ్ళినారు. ఆ వెళ్ళడం వెళ్ళడం వారిరువురు జైత్రయాత్ర సలిపి పదినెలలకు తిరిగి వచ్చినారు. వారు తిరిగివచ్చినప్పటినుండి అంతఃపురాలలో వసంతోత్సవ విషయం ఏమవుతుందనే గుసగుస లారంభమయినవి. వసంతోత్సవం వస్తున్నది. పదిదినాలు మాత్రమున్నది. ఏమి జరుగునో ఎవరికీ తెలియదు. శాంతిమూలుని హృదయమూ, ఆకాశపులోతూ ఒకటేనని పెద్దల అభిప్రాయము. ఆ దినాన శాంతిమూల మహారాజు తామే స్వయముగా రాకుమారి అంతఃపురానికిపోయి ఆ బాలికను తన హర్మ్యానికి కొని వచ్చినారు. ఆ బాలిక ఏదో ఆలోచించుకుంటూ తండ్రి ఆలోచనామందిరానికు పోయినది.

4

బ్రహ్మదత్తప్రభువు శాంతిశ్రీని చూచి, తెల్లబోయి, నిలుచుండిపోయినాడు. బ్రహ్మదత్తుని చూచి ఆ బాలిక నిర్ఘాంతపడినది. మోము వెలవెల పోయినది. మరుసటి క్షణంలో బ్రహ్మదత్తుడు యథాస్థితినంది చిరునవ్వుతో “ఏమి శిష్యురాలా! మహారాజు మందిరాలకు దయచేసినావు?” అని ప్రశ్నించినాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

77

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)