పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైతన్యరహితయై నిర్గుణగా ఉండే బాలికకు తనచేష్ట ఎంత అవమానమో కలుగజేసి ఉండాలి. లేకపోతే ఆమె అంతబాధ ఏలాపడి ఉంటుంది?

తాను యుద్ధయాత్రకు పోయి యుద్ధం అంటే భయపడినాడు. ఇది వరకు చిన్నతనంలో తాను చేసిన యుద్దా లేమంత ఘనమైనవి ఉన్నాయి? తనకు ఎప్పుడు ఇతికర్తవ్యతామూఢత్వమే! ఇతికర్తవ్యతామూఢులు “అవునా కాదా?” అనే కావడికుండల ఒడుదుడుకులలో పడిపోతూ ఉంటారు. తన తాతలు ధీరులు, జ్ఞానసంపన్నులు. ఆదిశేషులులా ప్రజాభారం మోస్తూ ఉండేవారు. తాను భారమే మోయలేని మామూలు నాగమ్మ అయి చక్కాపోయాడు. తన రక్తనాళాలలో రక్తమేనా ప్రవహించేది, లేక పారాణి నీళ్ళా? తన తలలో ఉన్నది మెదడా లేక ఊకఉండా?

రాకరాక తన హృదయంలో ప్రేమ ప్రవేశించింది. ప్రేమ అనే వస్తువు అవసరం లేకుండా తల్లిదండ్రులు ఏర్పాటుచేసిన బాలికను వివాహం చేసుకొని, సంసారధర్మం నిర్వహిస్తారు ఉత్తమ యువకులు. అట్లుకాక, ప్రేమ అనే రోగం దాపురిస్తే అన్ని అడ్డం తిరుగుతాయి. శాంతిశ్రీలో చైతన్యం కలిగిందని నమ్మక మేముంది? ఆమెకు ఇష్టములేనిచో తానెట్లా ఆమెను ఉద్వాహం అవడం? ఆమెను విడిచి ధర్మప్రకారం వేరొకబాలికను తానెట్లా వివాహం చేసుకోగలడు? తన హృదయం, బుద్ధి, అహంకారము ఆ బాలికను కోరినాయి. అవి వేరుగా ప్రసరించనేరవు. తాను మనస్సులో నైనా అలా ఊహించలేదు. ఆ బాలిక తండ్రిమాట జవదాటక వివాహానికి ఒకవేళ ఒప్పుకొన్నా తానట్టి వివాహాన్ని ఎలా అంగీకరిస్తాడు?

బ్రహ్మదత్తుడు ఆ బాలిక దివ్యసౌందర్యమూర్తిని తలంచుకొన్నాడు. ఆమె చూపులు తనకు కలిగించిన వేదనను స్మృతికి తెచ్చుకున్నాడు. తానూ, మహారాజూ ఆ బాలికకు బాధను కలుగజేస్తున్నారు. సాధారణ భోజనం విషయంలోనే ఇష్టంలేని పదార్థం తినిపిస్తే పడేబాధ ఇంతింత అని కాదు. అలాంటప్పుడు. వివాహం విషయంలో ఒక బాలికను వ్యధలో ముంచడం కంటె హైన్యం ఏముంటుంది?

త్వరలోనే నామెను భార్యగా కోరననీ ఆమెకు చదువు చెప్పుటకూడా మానివేస్తాననీ మహారాజుకు వార్త పంపాలని బ్రహ్మదత్తుడు నిశ్చయించుకున్నాడు. ఆ నిశ్చయానికి రావడంతోటే పట్టలేని ఆనందమూ భరింపరాని వేదనా రెండూ కలిగినాయి. తన ధర్మము ఏ మాత్రమూ స్వలాభం ఆలోచించకుండా నిర్వహించగలుగుతున్నందుకు, ఒక బాలికకు నిర్మలానందం సమకూర్చడానికి తాను కారకుడు కావడానికీ అతనికి ఎంతో సంతోషం కలిగింది.

ధర్మము పురుషునకై, జీవితము పురుషునకై, రాజ్యము పురుషునకై, మోక్షము పురుషునకై, ఎంతకాలము పురుషులు ఈలా స్త్రీలను తమలో భాగం చేసుకొని తామే సర్వమూ అయి మెలగడం? స్త్రీ పురుషులు సంపూర్ణ సమాన భాగస్వామ్యం పొందడం ఎన్నాళ్ళకో? వేదవిహిత ధర్మాలు ఆచరణలో పెట్టలేని మానవలోకం స్త్రీ విషయంలో ధర్మనిర్వహణం ఏమి చేయగలదు? రాకుమారి తన చదువువలననే బాధపడుతున్నట్లు కనిపించింది. తండ్రిమాట జవదాటకూడదని నిశ్చయించుకొన్న బాలిక కావున తన

అడివి బాపిరాజు రచనలు - 6

73

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)