పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుత్వం ఒప్పుకొన్నది. కాబట్టి తాను మహారాజుతో రాకుమారికకు చదువు చెప్పుట ధర్మముకాదని తెలపాలి, అని ఆలోచించుకొన్నాడు బ్రహ్మదత్తుడు. ఆ నిశ్చయానికి రాగానే బ్రహ్మదత్తుని హృదయభారం తీసివేసినట్లే అయింది.

ఆనందంతో ఆ సాయంకాలము సముచిత వేషంలో స్కందవిశాఖాయ నక బ్రహ్మదత్త ప్రభువు కోటలోనికి వెళ్ళి మహారాజు దర్శనము నర్దిస్తూ ఆలోచనా మందిరం లోనికి వెళ్ళేసరికి ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారి అక్కడ నిలిచి ఉన్నది.

2

ఇక్ష్వాకు శాంతిశ్రీ రాకుమారిని ఆంధ్రశాతవాన చక్రవర్తి దాయాది అయిన పులమావిశాతవాహన కుమారుడు రెండేండ్లనాటి వసంతోత్సవాలలో చూచినాడు. ఆ రాకుమారునకప్పుడు ఇరువది అయిదు సంవత్సరాలుంటాయి. వివాహమయినది. బృహత్పాలాయన సామంతుల కొమరితను చేసుకొన్నాడు. ఇరువురు బిడ్డల తండ్రి. ఇరువురు ఆడపిల్లలే.

వాసిష్ఠీపుత్ర శ్రీ పులమావి చక్రవర్తి రెండవకొమరుని మనుమడు. యజ్ఞశ్రీ శాతకర్ణి దివంగతుడు కాగానే తానే రాజ్యం ఆక్రమించుకొందామని దృఢసంకల్పం పూనినాడు పులమావి రాకొమరుడు. అందుకై బృహత్పాలాయనులను, పల్లవులను సాయం ఆర్థించాడు. కాని మహామండలేశ్వరుడైన ఇక్ష్వాకు శాంతిమూల మహారాజు శ్రీవిజయశాతకర్ణిని చక్రవర్తినిచేసి, జైత్రయాత్రలు సలిపినాడు. శాంతిమూలుని ఎదిరించగల మగవాడు ఎవడు?

విజయశాతకర్ణికి బావమరది అగుటచేకదా శాంతమూలుడు సహాయం చేసినాడు. శాంతిమూలునకు తాను అల్లుడే అయితే తనకిక కుడిచేయి ఎడమ చేయీ శాంతమూలుడే. వీరపురుషదత్తుడుకూడ మహావీరుడు. ఇతన్నెవరు తేరి చూడగలరు అనుకొన్నాడు పులమావి రాకుమారుడు.

శాంతిశ్రీ రాకుమారి రూపజిత రతీదేవి. ఓహో! ఏమి సౌందర్యమది! అలాంటి సౌందర్యంచూచి ముగ్దుడుకాని పురుషుడు ఉండగలడా? ఈ మహాదాంధ్రపథంలోని కవులంతా ఆ బాలికా సౌందర్యం వర్ణించడమే తమకు జన్మసాఫల్యం అనుకుంటారు.

ఆ నాడు తానామెను చూచిన మరుక్షణంనుంచీ ఆ బాలికను గురించే మాట్లాడడంవల్ల నర్మసచివుడు “మహారాజా! తమకు శాంతిశ్రీ జబ్బు పట్టుకున్నదా?” అని గేలిచేశాడు. తాను చక్రవర్తి అగుట అల్లా ఉంచి, ఆ బాలికను వివాహం చేసుకొని తీరవలెనని ప్రతిజ్ఞపూనినాడు.

పులమావి రాకుమారుడు కొంచెం బొద్దుగా, పొడవుగా ఉంటాడు. విశాలమైన ఫాలం, గరుడనాసిక, లంబకర్ణాలు. కాని పెదవులు రెండు గీతలు గీచినట్లు సన్ననివి. అతని గడ్డము చాల చిన్నది. ఆ గడ్డముకూడ ముడుతలు పడి ఉంది అతనికి చేరేడేసి కళ్ళు. కాని లోచనాంగాలలో సౌమ్యస్థితిలేదు. నల్ల గుడ్లు చిన్నవి. అందుకే అతడెప్పుడు అతికోపంతోనో, అతి భయంతోనో చూస్తూ ఉన్నట్లు ఉంటాడు. పైగా కొంచెం మెల్ల

అడివి బాపిరాజు రచనలు - 6

74

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)