పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తృతీయభాగం

రతీదేవి

అడవి బ్రహ్మదత్తుడు మహారాజకుమారికకు మరల విద్య ప్రారంభించవలెనా, వలదా? పదినెలలు అంతరాయం వచ్చింది. తాను ఏమొగం పెట్టుకొని వెళ్ళి ఆమెకు పాఠం చెప్పగలడు? వసంతుడైన పురుషుడు వనరముగా ఒక బాలికను ఎన్నుకుంటే, ఆ బాలికను భార్యగా ఎన్నుకొన్నాడన్నమాటే. ఆ స్వయంవరాన్ని పెద్దలుకూడా కాదనలేరు. సగోత్రీకురాలిని ఎన్నుకొనగూడదు. తాను వివాహంకాదలచుకొన్న బాలికనే ఎన్నుకోవాలి. మన్మథుడుగా ఎన్నాకైనవాడు రతీదేవిని ఎన్నుకొన్నా అంతే. బ్రహ్మదత్త ప్రభువు రతీదేవిగా రాజకుమారి ఇక్ష్వాకు శాంతిశ్రీని ఎన్నుకొని లోకానికి ఆమెనే తాను ప్రేమించినది అని నిరూపించినాడు. అది ఎంత ద్రోహము, ఎంత నీచకార్యము? లోకంతో సంబంధం లేక యోగినీహృదయంతో జీవించే ఒక బాలికను, సమస్త బాలికాలోకం ఎదుట రతీదేవిగా ఎన్నుకొని తాను సలిపిన పాపానికి నివృత్తి లేదు.

ఆ దినాన తనకట్టి హీనబుద్ది కలగడానికి కారణమేమి? తన హృదయాంత రాళాలలో ఆమెపై వలపు ఉన్నదన్న మాటేగదా? ఆ వాంఛను దాచుకో లేని, వాంఛను నాశనం చేయలేని దుర్భలత్వం తనలో ప్రవేశించింది. అది తధ్యము. ఎంత అంద మా బాలికకు? లోకంలో యుగానికొక బాలిక అంత అతిలోక సౌందర్యవతిగా ఉద్భవిస్తుందేమో? అదివరకు మహారాజు తనయ జగదద్భుత సుందరి అని చెప్పుకొనే మాటలు విన్నప్పుడు తన కేవిధమైన స్పందనమూ కలుగలేదు. కాని, తన్ను మహారాజు ఆ బాలికకు గురువుగా ఉద్దేశించి తమ రాజహర్మ్యానికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఆ దివ్యసుందర గాత్రను చూచినప్పుడు, తన కళ్ళు మిరుమిట్లయి తక్కిన లోకం అగోచరమై పోయింది.

ఆ బాలిక అందం హిమాచలశృంగస్వరూపమైంది. ఆ అందం మానవ మాత్రులకెట్లు సన్నిహితం కాగలదు? ఆమె హృదయం వజ్రాయుధపు తునకలు కరిగించి పోతుపోసి ఉండవచ్చును. సూర్యబింబాన్ని తన కొమరితకై తురిమినప్పుడు ఆ తురుముడు పోగుచేసి ఆమె మెదడు చేసి ఉంటాడు దాత. ఆమెలో రక్తం ప్రవహిస్తూ ఉంటుందా, లేక కరిగించిన సూర్యకిరణాలు ప్రవహిస్తూ ఉంటాయా? తాను వెఱ్ఱిబాగుల వానిలా ఆ బాలికను రతీదేవిగా ఎన్నుకొన్నంత మాత్రాన ఆమెలో మానవ చైతన్యం తీసుకువచ్చి, స్వచ్ఛమైన ఆమె చెంపలలో కల్హారాలు విరియపూయిద్దా మనుకున్నాడు.

బ్రహ్మదత్తుడు ఉస్సురని లేచినాడు. ఈ పదినెలలు ఆ యువప్రభువు పడినవేదన వర్ణనాతీతము. ప్రేమను దగ్గరకు రానీయక శ్రీకృష్ణ భగవద్బోధితమయిన స్థితప్రజ్ఞత్వము తన ఆశయంగా పెట్టుకొని సన్యాసాశ్రమ స్వీకారము త్వరలో పొందడానికి నిశ్చయించుకొన్న తనకు ఎక్కడనుండి వచ్చినదీ అవస్థ? ఆ బాలికకు ఆ దినాన ఏదో నిర్వేదము కలిగినందుకు తామందరు సంతోషించినామని వీరపురుషదత్తుడు తెలిపినాడు.

అడివి బాపిరాజు రచనలు - 6

72

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)