పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“చదువు ప్రారంభానికి శుభముహూర్తం కూడా నిశ్చయించారు!”

“నీకు యిష్టంలేదా?”

“లేదు.”

“ఎందువల్ల? ఇందులో భయపడవలసిందేముంది?”

“భయం కాదండీ, ఇంత బుద్దధర్మమూ చదివి, మళ్ళీ ఆర్షధర్మమా?”

“తల్లీ! ఎంత వెఱ్ఱిదానవు. నాయనగారు శ్రీరామచంద్రుని భక్తులు. దేవతల ప్రీతికోసం క్రతువులొనర్చి సర్వప్రజాసౌభాగ్యంకోసం కర్మయోగం సలిపే రాజర్షులు. వారి కొమరితకు ఆర్షధర్మం విజాతీయం కాదుకదా?”

“వినండి.”

“అవధారు!”

“ఏదో దిగులుగా ఉన్నది నాకు.”

“ఒక్కవిషయం చెప్పుతున్నాను విను శాంతీ! మనుష్యులందరూ సర్వధర్మాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నంత మాత్రాన మనకు ప్రీతిపాత్రమగు ధర్మము మనలో నీరసించిపోయే టట్లయితే, ఆ ధర్మము ఉన్నాఒక్కటే, లేకపోయినా ఒకటే! ఏ ధర్మమూ నిత్యముకాదు. లోకంలో అనేక ధర్మాలు యుగయుగానికీ శకశకానికి మారుతూ ఉంటాయి. బౌద్ధధర్మమే ఎన్ని రూపాలు తాల్చలేదు తల్లీ! ఈ ధర్మాలలో బలముకలవి కొన్ని తరాల వరకు ఉంటాయి. కొన్ని వెంటనే నశించిపోతాయి. ఆర్షధర్మం అంటే భయమా అని నేను ప్రశ్న అందుకనే వేసినాను. ధనక ప్రభువును గురువుగా ఒప్పుకో చెల్లీ!” యువరాజు చెల్లెలు నమస్కరింప ఆశీర్వదించి, ఆమెను దరికి చేర్చుకుని తలపై చేయివైచి కురులు సవరించి, “ఆర్షధర్మాలు నేర్చుకోనని పట్టుబట్టకు తల్లీ!” అని వెడలిపోయినాడు.

ఆ జగదద్భుతసుందరి స్నానమాడి శుభ్రవస్త్రాలు ధరించి కచ భాగ్యము తలపై పరిష్కారిణులు ముడిగా రచింప బుద్దపూజా గృహానికి పూజకై పోయినది.

మగవారు మరచిపోయినా స్త్రీ లోకం ధర్మాన్ని మరవలేదు. ఆంధ్ర మహాదేశంలో బౌద్ధధర్మం కొంచెం తగ్గిపోయి, మరల ఆర్షధర్మం నూతన రూపంలో మొలకెత్తినది. అయినా ఆంధ్ర వనితామణులు బుద్దారాధన కొనసాగిస్తూ, సంఘారామాలకూ, స్తూపాలకూ విరివిగా దానధర్మాలు చేస్తున్నారు. శిధిలములయ్యే చైత్యాలను బాగు చేయిస్తూనూ ఉన్నారు.

పురుషులలో బౌద్దభక్తి పూర్తిగా నాశనము కాకున్నను శాతవాహను నాటి అఖండభక్తి తగ్గిపోయింది. వారూ బౌద్దారాధనలు చేస్తూ దానధర్మాలు చేస్తూనే ఉన్నారు. తమ స్త్రీలు భక్తితో చేసే ఆరాధనలకు, దానధర్మాలకూ ఆనందిస్తూ ఉన్నారు.

మాఠరి సారసికాదేవి శాంతహృదయ, పరమబౌద్ద భక్తురాలు. అయినా భర్తసలుపు అగ్నిసోమక్రతువున ఆమెయే సోమిదమ్మ అయినది. శాంతిమూల మహారాజు చెల్లెండ్రు, శాంతిశ్రీ హమ్మశ్రీలు వదినగారి యందు భక్తికలవారు. తమ చిన్నతనంనుండి బౌద్దధర్మాభిరతలై ఉన్నా బౌద్దధర్మ బోధనలను అంతగా చవిచూచి ఎరుగరు. సారసికాదేవి సకల విద్యాపారంగతురాలు. బౌద్ధధర్మ నిష్ణాత కాబట్టి మరదండ్రకు బౌద్ద నికాయాలూ, పీఠకాలూ, అభిధర్మసూత్రములు తెలియజెప్పేది.

అడివి బాపిరాజు రచనలు - 6

28

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)