పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/37

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాసిష్టీ పుత్రికలు శాంతిశ్రీ, హమ్మశ్రీ లిద్దరు బుద్దారాధన చేసిరి. మాఠరీ పుత్రి శాంతిశ్రీ ఆరాధన సామాన్యమయినది కాదు. అటు తల్లీ, మేనత్తలూ గురుత్వం చేసినదలా ఉండగా ఆ బాలికకు ఆనందార్హతలు ముఖ్య గురువులై బౌద్ధధర్మ సర్వస్వం కరతలామలకం చేసిరి. అట్టి శాంతిశ్రీకి ఈ బ్రహ్మదత్తప్రభువు గురువగుట యెట్లు? ఆయన ఎంత పండితుడైనా, సద్గుణ సంపన్నుడైనా నిమతాభిమాని కదా. బుద్ధదేవా, అహింసా పరమావతారా నువ్వు తప్పింపలేవా, నాకీక్రూరవిధి సంఘటన!” అని ఆమె పూజా గృహంలో మహాశ్రమణక విగ్రహం ముందు సమాలింగిత భూతల అయింది.

9

హారాజు ఆజ్ఞ అనుల్లంఘనీయము. రాజకీయాలలో పాల్గొంటూ, రాజ్యాలు పాలిస్తూ పవిత్ర బ్రాహ్మణవంశాలు నీచగతి పొందాయి. ఒక్కసారి శతవృద్దుడైన అవతారమూర్తి నాగార్జునదేవుని కలుసుకొని, ఆ మహాత్ముని ఆజ్ఞను గ్రహించడం ఉత్తమమని విశాఖాయనక ప్రభువు రథారూఢుడై శ్రీ పర్వత పాదానికపోయి, కొండ గుహలలోనుంచి కొండచరియపైకి, కొండ చరియపై నుండి శైలగర్భానికి తొలిచియున్న మెట్లనెక్కుచు శిల్పాలు చిత్రలేఖనాలు గమనింపకుండా, ఆ ధనకప్రభువు శైలశిఖర సమతలంపైన మహోత్కృష్ట ప్రజ్ఞతో ఆంధ్రబ్రాహ్మణ శిల్పవంశంవారు రచించిన మహా సంఘారామ విహార భవనాలకు పోయినాడు. ఆ భవనాల క్రిందిభాగము శైలశిఖరభాగమే, పై అంతస్థును మాత్రం సమతలంపైన పెద్దయిటుకలతో నిర్మించారు. ఈలాంటి అంతస్థులు నాలుగున్నాయి.

నాలుగవ అంతస్తులో కొండ లోయలన్నీ పరకించి చూడడానికి అనువుగా ఒక విహారమందిరం, ఆ మందిరానికి నాలుగువైపులా ద్వారా లున్నాయి. ఒకవైపు విజయపురి రాచనగళ్ళూ, కోటా కనిపిస్తవి. వేరొకవైపు కృష్ణానదీ, ఇంకో వైపు నగరము, నాలుగో వైపు కృష్ణానదిన్నీ, ఆ విహార మందిరంలో మొగలి ఆకు చాపలు నేలెపై మంచాలపై, పరచిఉన్నవి. ఆ చాపలన్నీ నూలువస్త్రాలకన్న మెత్తవై, కంబళులకన్న దళసరై ఉన్నాయి. ఆ మందిరంలో ఒక బంగారు బుద్దవిగ్రహం తూర్పువైపుగా ఉంది. పడమటి గోడచెంత ఎఱ్ఱగంధపు చెక్క మంచముపై పరచిన తూలికామృదుల కృష్ణమృగాజినముపై నొక శతవృద్దు కూర్చుండి ఉన్నాడు. ఆయనకు నూట పదిహేను సంవత్సరాలున్నవి. ఆ దివ్యపురుషుని దేహము ఈ షణ్మాత్రము వదలినట్లు లేదు. ఇంక ఆ విహారమందిరంలో ఏ వస్తువులు లేవు. శ్రీ నాగార్జునదేవుడు ఆరడుగుల పొడవువాడు. దక్షిణకోసలస్థమైన ఆంధ్రబ్రాహ్మణ వంశంలో ఉద్భవించిన అవతారమూర్తి నాగార్జునదేవుడు. ఆయన బోధిసత్వుడని ప్రజల విశ్వాసము.

సర్వవిద్యాపారంగతుడు. అవధిలేని జ్ఞానం రూపొందినమూర్తి. సకల జంబూద్వీపము, త్రివిష్టప చీనాదేశాలు, యవసువర్ణప్లక్ష్మ శాకశాల్మవి కుశక్రౌంచ పుష్కరాది సప్తద్వీపములు తిరిగి వచ్చినాడని ప్రతీతి. ఆర్జానార్ష ధర్మములు బుద్దధర్మమూ అత డవగాహించెను. బుద్ధదేవునితో పాటు నాగార్జునదేవుని భక్తిమై ఎల్లరు స్మరించేవారు.

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
29