పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాయబారం పంపించారు. నా హృదయం శాంతశ్రీ, బాపిశ్రీలకు దత్తమైనది. నువ్వుతప్ప నాకు ఆలోచన చెప్పేవారులేరు. ధనకప్రభువు ఆలోచనపైననే, మహారాజు నాకడకు పూంగీయప్రభువును రాయబారము పంపించారు. ఆ మామయ్యగారు, తమ కొమరిత విషయం ఎరిగి ఉండి కూడా అత్తయ్యగారి సంప్రదింపుతోనే నాదగ్గిరకు వచ్చారుట!” అని చెల్లెలి వేపు యువరాజు దీనంగా చూచాడు.

“వాసిష్టీ రాజకుమారిని మీరు వివాహం చేసుకోవాలని రాజధర్మం విధిస్తున్నది.”

“ఉజ్జయినీవారు మన సహాయం అర్థిస్తున్నారు. వారి సామంతులు వాకాటులూ, నలులూ తిరుగుబాటు చేస్తున్నారు. మృగ రాజుబలం తగ్గగానే చిన్న చిన్న జంతువులన్నీ తలలెత్తుతాయి. చక్రవర్తి దిగ్విజయంచేసి పది సంవత్సరాలయింది. దేశంలో ప్రతి మహాసామంతుడు చక్రవర్తి కావలెననే! అందులో చక్రవర్తి దాయాది పులమావిప్రభువు ప్రతి చిన్న సామంతునితోను కుట్ర చేస్తున్నాడు. అందుకే మాళవమహారాజు మన సహాయం అర్ధించి ఉండవచ్చు.”

“అన్నయ్యగారూ! మీరు చెప్పింది నిజం.”

శాంతిశ్రీ సర్వశాస్త్రాలూ చదువుకొన్నదానివలె ఇరువైపుల హెచ్చు తగ్గులు సరిచూచి చెప్పినట్లు తీరుపు చెప్పినది.

8

వీరపురుషదత్త యువరాజు ఆశ్చర్యమున చెల్లెలివంక చూచినాడు.

వీర: మనకు క్షాత్రవులు చుట్టాలు. వెనక శ్రీ పులమావి చక్రవర్తి క్షాత్రప రాకుమారిని ఉద్వాహమైనాడు. క్షాత్రపరుద్రసేన మహారాజుకు శ్రీరుద్ర దేవభట్టారకకుమారి అను సౌందర్యనిధియైన పదునారేండ్ల బాలిక ఉన్నది.

“అన్నగారూ! ఈ రాచకార్యాలకు, పెళ్ళిమనువులకు ముడిపెట్టడం నావల్ల నేమవుతుంది? నేనేమి ఆలోచన చెప్పగలను? మీరు ఆనందార్హతాచార్యులతో ఆలోచించండి.”

“ఇంతకు నేను ఉజ్జయిని వెళ్ళడం?

“వసంతోత్సవము వెళ్ళగానే మీరు వెళ్ళుతున్నారు కాదా?”

“అది రాజాజ్ఞ!”

“అలాగే వెళ్ళిరండి. ఇంక ఒకవిషయం; నాకు ఆనందార్హత గురుదేవుల శుశ్రూషమానడం ఇష్టంలేదు.”

“నిన్నెవరు మానుమన్నారు తల్లీ?”

“మహారాజులు, శ్రీబ్రహ్మదత్త ప్రభువుకడ ఆర్షధర్మాలు, దర్శనాలు నేర్చుకో వలసిందని ఆజ్ఞ ఇచ్చారు.

“స్కందవిశాఖాయనక ప్రభువు ఇంకా యువకులు. ఆయన చెంత శుశ్రూష ఉచితమా అని సందేహిస్తున్నాను. ఆయన జగద్విఖ్యాత పండితులనేది నిజమే కాని నాకేమో మనస్కరించడంలేదు. అయినా కారణంలేకుండా మహారాజు ఇలాంటి ఏర్పాటు చేస్తారా?”

అడివి బాపిరాజు రచనలు - 6

27

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)