పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


హారీతసులకు ఎన్నితరాలనుండో సంబంధాలు ఉన్నవి. అదివరకే అంతిపురాలలో చాలా కాలంనుండి వాసిష్టి భట్టిదేవిరాకుమారుని వీరపురుషదత్తుని కల్పింప సంకల్పించిఉన్నారు. శాంతి మూలుని కోర్కెఅది. యువరాజు ఉజ్జయిని వెళ్ళుచున్నాడు అంటే క్షాత్రప రాజకుమారిని చూచుటకే అని ఆ రాజకుమారికల కిరువురకు తోచినది. ఈ ఆలోచనలతో వారిరువురూ క్రుంగిపోయినారు.

బాపిశ్రీని, శాంతశ్రీని వీరపురుషదత్తుడు తేరిపారచూచాడు. ఆ బాలిక లిరువురూ, వెన్నెలా వెలుగూ, పుష్పమూ సుగంధమూ, గీతమూ రాగమూలా మూర్తించి ప్రకాశించినారు. సాధుహృదయ అందాలబాల బాపిశ్రీ వేడిగాడ్పు తగిలిన కలువపూవువలె వడిలిపోయింది, సూర్యకాంతి తగిలిన వజ్రమువలె శాంతశ్రీ మండిపోయినది.

చెల్లెలు ప్రక్కనున్నదని మరిచిపోయి, వానలు కురిసినప్పుడు ఉప్పొంగే నదిలా యువరాజు లేచినాడు. బాపిశ్రీ కడకుపోయి ఆ బాలికను తన కుడిచేతితో ప్రక్కకు లాగికొని బిగియార వామహస్తాన చుట్టివేసినాడు. శాంతశ్రీ కడకుపోయి పొంకాలు తిరిగిన దక్షిణ బాహువుచే ఆమెను చుట్టి ఇద్దరిని ఒక్కసారిగా తన హృదయాన కదుముకొన్నాడు.

“శాంతా! బాపిశ్రీనికా! నేను మహారాజుల ఆజ్ఞచొప్పున ఉజ్జయిని వెళ్ళవలసి వచ్చింది. వెంటనే తిరిగివస్తాను. ఒక్కటే నామాట నమ్మండి. మీ ఇద్దరికీ నా హృదయం మన బాల్యంనుంచీ అర్పించుకొన్నాను. రాజ్యావసరాల కొలది ఇతర రాకొమరికలు నా జీవితంలో ప్రవేశింతురుగాక; వారిపట్ల ధర్మం నిర్వహిస్తాను అంతే!” అని రాకొమరుడు వారి మూర్ధములను ఇటు అటు తిరిగి చుంబించినాడు.

శాంతశ్రీ ఆశ్చర్యం పొందింది. బాపీశ్రీ ఆనందంతో ఉప్పొంగిపోయి త్రవతియై తలవాల్చింది. వారిరువురు నెమ్మదిగా యువరాజు కౌగిలిలోనుండి ఈవలకు వచ్చినారు. మహారాజకుమారికి అన్నగారిమాటలు, మూర్దాఘ్రాణాలు మొదలే అర్థము కానివి. శాంతిశ్రీయు, బాపిశ్రీయు బావగారికి నమస్కరించి, శాంతిశ్రీని కౌగిలించుకొని, వారిరువురి అనుమతి నడిగి వెళ్ళిపోయినారు. వారిని ఆ మందిర కవాటంవరకు యువరాజు, ఆయన చెల్లెలు సాగనంపి వచ్చారు.

“చెల్లీ! నువ్వా ఆసనం అలంకరించు. శ్రీ నాయనగారి తల్లి పుట్టిన రాజ్యం ఎరుగుదువుగా, మధ్యకళింగం? దేవరాష్ట్రాధిపతులు వాసిష్టులు మనతాతగారి అత్తవారు. మన మేనమామలు మాఠరులకు, ఆ వాసిషులకు ఎన్నాళ్ళనుంచో సంబంధ బంధవ్యాలున్నాయి. ఆ వాసిష్టులు మధ్యకళింగానికీ, మాఠరులు దక్షిణకళింగానికీ మహారాజులు. చక్రవర్తికి మనతోపాటు మహాసామంతులు. కానీ నాయనగారిది దూరదృష్టి చక్రవర్తి అవసాన దశలో ఉన్నారు. చక్రవర్తి కొమరుడు, మనుమడు ఇద్దరూ ప్రజ్ఞారహితులు. వారు సింహాసనం ఎక్కినా నామకఃమాత్రమే! మహాసామ్రాజ్యము ఎవరు కాపాడేది? ఆ మహాభారము భరించవలసినది మన ఇక్ష్వాకు వంశమే!

“అందుకే రాజ్యబలంకోసం అనేక రాజకుటుంబాలతో వియ్యాలంద బోతున్నారు నాయనగారు. పిష్టపురంనుంచి మాఠరులూ, దేవపురంనుంచి వాసిష్టులూ మనకు బలం చేకూరుస్తారు. వారు తమబాలిక భట్టిదేవిని నాకు ఉద్వాహం చేయాలని సంకల్పించి

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
26