పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొన్నాడు. చంద్రావతీదేవి గాధ యెంత పవిత్రమైనది. విజయవాటిక నింద్రకీలమున దపమాచరించిన యర్జునునకు బ్రత్యక్షమైన పరమేశ్వరుడు 'అర్జునేశ్వరు' డైనాడు. చంద్రావతిదేవి మల్లీపుష్పముల బూజించిన యా శ్రీశైలేశ్వరుడు మల్లికార్జునుడైనాడు. భగవంతు డెంత భక్తవత్సలుడు!

ఆలోచనాధీనుడై విష్ణువర్ధనుడు తన భవనోద్యాన వాటిక బ్రవేశించినాడు. ఒంటిగా నుద్యానవనమున సంచరించుచు నా సాయంకాలము విరియబూచిన మల్లెపొదలను జూచి యొక్క నిట్టూర్పు విడిచినాడు. చంద్రకిరణములు భూమిని వ్రాలి, కాకుసుమములైనవట! కవులెంత మతి లేనివారో యని యనుకొనినాడు. ఒక బొడ్డుమల్లె నతడు కోసి, కన్ను లరమూతలువడ నాఘ్రాణించుచుండెను.

తన వెనుక నెవరో వచ్చినట్లు పదముల చప్పుడుకాగా నాతడు చటుక్కున వెనుదిరిగెను. పిష్టపురమున దానుజూచిన బాలిక యెదుట నిలిచియున్నది.

“మీరా!”

“నీవా!”

“చాళుక్యమహారాజు వచ్చెను, గాన మీరు తప్పక దర్శన మీయగలరనియే నే నిచ్చటకు వచ్చితిని.”

“అదెట్లు సంభవము?”

“తమకు దోటలన్న నిష్టమని గ్రహించితిని.”

“అవును, నాకిష్టమే! రాజసేవకులకు మాకు వనవిహార మొనర్చుటకు దీరిక యెక్కడిది!”

“ప్రభూ! పూవులు పూయని ప్రదేశము లోకమున నుండునా!”

“ఆ! మరుభూములు. నా బ్రతుకే మరుభూమి.”

“అట్లనకుడు ప్రభూ! అంతర్విచారణోన్ముఖులైనవారి కొక్కొకపు డిట్టి విషాద భావములు గ్రమ్ముకొను చుండును.”

“రాజకుమారీ! మీ మహారాజకుమారి సేవను వదలి నీవెట్లు రాగలిగితివి?”

“దుఃఖభూయిష్టమైన యీ లోకములో నిట్టియుత్తమ స్నేహములే యానందము నిచ్చునవి. మనుష్యుడు స్నేహమును వాంఛించును. అందుకై పరితపించును.”

“తమ తల్లిదండ్రు లెవరు?”

“నాకు దల్లిదండ్రులు లేరు. అన్నగార లిరువురున్నారు. వారువారి పనులలో నిమగ్నులై యుందురు. నేను 'దేశమ్మకాకి'నై యిట్లు తిరుగుచుందును.”

“అదేమి ప్రభూ! విష్ణువర్ధన మహారాజులు ప్రేమార్ణవులని చెప్పుకొందురే!”

“అది నాకేమి లాభము! వారు నాకింత యాశ్రయ మిచ్చిరి. వారితో వచ్చుట వలన, నా యావేదన తీరునట్లు దేశము తిరుగుట కనువైనది.”

“సర్వసౌందర్యములును రూపొందిన యా బాలిక మోము చంద్రకాంతులు ప్రసరించి, యామె నొక దివ్యభామిని యనిపించినవి. ఆమె పెదవుల క్రీడాభరిత మందహాసములు విరిసినవి. ఆమె దోసెడు మల్లికాకుసుమములు కోసికొని విష్ణువర్ధనుని

అడివి బాపిరాజు రచనలు - 6

• 277 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)