పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/284

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుబ్జ విష్ణువర్ధనమహారాజు శ్రీశైల మల్లికార్జున దేవుని దర్శించి వైభవోపేతముగ బూజ లొనరించినాడు. ఆ సమయమున మండలేశ్వరుడు బుద్దవర్మ తన మహాప్రభువు క్షేమమునకై మహాదానము లెన్నిటినో చేసినాడు.

21

జయనంది తాను మాధవీలతాకుమారిని వరించినట్లును, ఆమె తల్లిదండ్రులు నా రాజకుమారియు తమ సంబంధమున కత్యంతహర్షితులై యామోదించిరనియు దండ్రికి రహస్యలేఖలు పంపినాడు. అరువదియైదు వర్షముల వృద్దుడైన కాలకంపన ప్రభువు తన కీసంబంధ మత్యంతము నభీష్టమనియు దాను మహారాజు ననుమతిని వేడుచు నుత్తరము పంపుచుంటిననియు, గొమరునికి వార్త పంపినాడు.

పట్టవర్ధనరాజ పురోహితుడు లేఖలుగొని వేంగీపురమునకు వచ్చినాడు. ఆతడు వచ్చిన మూడుదినములకు గుబ్జ విష్ణువర్ధనమహారాజు ససైన్యముగ వేంగీపురమును జేరినాడు.

తన ప్రాణహితుడగు జయనంది బృహత్పలాయన రాజకన్యకను వివాహమాడుట తనకు నత్యతానందమును సమకూర్చు విషయమని, విష్ణువర్ధనుడు జయనందిని తన సమ్ముఖమునకు రావించుకొని యాతని నాశీర్వదించెను.

జయ: మహాప్రభూ! తాము బృహత్పలాయన రాజకన్యకను జూచియున్నారు.

విష్ణు: అవును, పిష్టపురమున నామెను జూచితిని గదా! ఆమె పేరు, మాధవీలతాకుమారి కాదా?

జయ: చిత్తము.

విష్ణు: మిత్రమా! నీ వెంతయో అదృష్టశాలివి. ఆ బాలిక గుణరూపసమన్విత, ఆమెకు విష్ణుకుండిన రాకుమారి యనిన నెంతభక్తి!

జయ: ప్రభూ! చాళుక్య కులదీపకులు - తమరు...

విష్ణు: అయినచో...

జయ: చాళుక్యవంశము, చంద్రవంశము.

విష్ణు: మంచిది!

జయ: ఆ చంద్రవంశమున బూర్ణ చంద్రులు మీరు.

విష్ణు: నాచుట్టును చంద్రికలు లేవుకదా!

జయ: మహాప్రభూ! ఆ చంద్రికాదేవికై లోకమెల్ల నేదురు చూచుచున్నది.

విష్ణు: నేను అమావాస్య చంద్రుడను.

జయ: పాప ముశమించుగాక! మహాప్రభూ! తాము రాకాచంద్రులగుట కొక అంశువుమాత్రము లోటైనది.

విష్ణు: ఆ యంశువును శివుని జటాజూటమునుండి కొనివత్తువా.

జయ: మీ శిష్యులము కైలాసమునకైన బోగలము.

జయనంది విష్ణువర్ధనునికడ సెలవు గైకొని వెడలి పోయెను. విష్ణువర్ధను డా సంభాషణమునే తలచుకొనుచు దన జన్మము రాకాపూర్ణిమగ నెట్లు మారునని యను

అడివి బాపిరాజు రచనలు - 6

• 276 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)