పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కడకు వచ్చి “ప్రభూ! తామొక్క మల్లికాకుసుమమే కోసికొన్నారు. ఈ పూమొత్తము లన్నింటిని గ్రహింపుడు. అప్పుడే మీకీ పూవుల రహస్యము హృద్గతము కాగలద”ని తలవాల్చి పలికినది.

విష్ణువర్ధను డామెను చేయెత్తి వారించి “రాజకుమారీ నీవు విష్ణుకుండిన రాజకుమారి చెలియలవు. నేనెవరైనది నీకు బూర్ణముగ దెలియదు. నేను పొట్టివాడను. నాకిప్పు డిరువదెనిమి దేండ్లున్నవి, అయినను నాగుజ్జుదనము వలన నొకబాలకునివలె గన్పట్టుదును. నీవు నన్ను బాలకునిగా దలచి నిస్సందేహముగ నాతో మాటలాడుచుంటివేమో” యని యాతడు సవిచారముగ బల్కినాడు.

22

విష్ణువర్ధనుని మాటల కంశుమతీకుమారి యిసుమంతయు గలత నందలేదు. ఆమె సునిశ్చల మనస్కయై అటులనే నిలుచుండెను. మోమున చిరునగ వింతేని జెదిరిపోలేదు.

“ప్రభూ! నేను కులీనను. ప్రేమకు బొట్టి పొడుగు లాలంబనములు గావు. నిర్మల హృదయమే యాలంబనము. తొలిసారి మిమ్ము పిష్టపురమున జూచినప్పుడే నా హృదయ కుసుమమునకు మీరే తావియని దివ్యభావము స్పురించినది.”

విష్ణువర్ధనుని ఆశ్చర్యమునకు మేరలేదు. “రాకుమారీ! నీవు విష్ణుకుండినుల చుట్టమవు. మీరు బ్రాహ్మణక్షత్రియులు గదా! ఇక నే నెట్టి కులమువాడనో! హీనవంశజులు గూడ సామంతులు కావచ్చును గదా! అదియును గాక! నే నొక సామంతుడను, సైనికుడను.”

“ప్రభూ! సామంతత్వముగాని మహారాజాధికారము గాని అంతఃకరణ వృత్తికి నుద్దీపనమెట్లగును! నిజమును గోచరింప జేయునది అంతస్సాక్ష్యము. నాకా పిష్టపురముననే సత్యము దర్శన మిచ్చినది. నే నచ్చటనుండి నా తల్లిదండ్రుల కడకు వచ్చిన తోడనే వారికి బ్రభువుల గురించి నివేదించితిని వారి యనుమతి పొందితిని. మా కులగురువు నారసింహ భట్టువారును నందు కనుమతించి నన్నాశీర్వదించినారు”

“ఎవరు రాకుమారీ! నీ తల్లిదండ్రులు? నేను దిగ్భ్రమ నందుచున్నాను.”

“ప్రభూ! నేను మంచనభట్టారక మహారాజు తనయను, నన్నంశుమతి యందురు.”

“ఏమీ! మీరు మహారాజు తనయ అంశుమతీ కుమారికలా!”

ఆత డొక్కనిమేష మక్కడుండలేక, వేగమున మోము వెనకకు ద్రిప్పి చూడకయే వెడలిపోయినాడు. అంశుమతీ కుమారి తెల్లబోయి, రిచ్చవడి యచటనే నిలుచుండి పోయెను.

అప్పుడు మాధవీలత పకపక నవ్వుచు నామె కడకు వచ్చి “దొంగా! ఎంతపని చేసితివమ్మ? నా కిసుమంత యేని జెప్పక నీహృదయ - చోరుని గలియుటకు దొంగవలె నిచటకు వచ్చితివా?”

“నేను దొంగనగుటెట్లు మాధవీ? మన పరిచారికలతో నిచ్చటకు బోవుచుంటినని చెప్పియే వచ్చితిని.”

అడివి బాపిరాజు రచనలు - 6

• 278 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)