పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భారతీయస్త్రీ దాను వివాహమాడిన భర్తను ప్రేమించి తీరును. బలవంతముగనైనను నంశుమతీకుమారిని వివాహ మాడగల్గినచో దన యదృష్టము మిన్నుముట్టును.

ఒకనాడు దానార్ణవుడు తన యాంతరంగిక మిత్రుడగు కుంభమిత్రుని బిలచి, “మిత్రమా నీవు అంశుమతీ రాకుమారిని పిష్టపురమును జేర్చునపుడామె దగ్గరి బందుగురాలును, నందమున నామెకు మాత్రమే తీసిపోవు మాధవీలతకాకుమారిని జూచియుంటివి గదా! ఆమెనుగూర్చి నీ వేమాలోచించుచుంటి”వని ప్రశ్న జేసెను.

“నేను ఏమాలోచించు చుంటిని! ప్రభువులయాజ్ఞ నేరవేర్చుటయే నా యాలోచన.”

“అవును. నీవు ప్రభుభక్తి పరాయణుడవు, అయినను నా బాలికను జూచితివిగదా యని యడుగుచున్నాను.”

“చూచితిని ప్రభూ! మీరు అంశుమతీ రాకుమారిని బ్రేమించి మీదేవేరిని జేసికొన దలంచినారు గదా! అయినచో మాధవీకుమారి ప్రసక్తి యేమున్నది?”

“నీవు మాధవుడవు రావలయునయ్యా!”

“నేను గుంభమిత్రుడను మాధవుడుగా నెట్లు కాగలను ప్రభూ?”

“ఓయి కుంభకర్ణబలుడా!”

“ఔను నేను కుంభకర్ణుడనే, నలువురి గుంభకర్ణుల నా భుజముల మోచికొని సముద్రమున బారవైచి రాగలను.”

“అది కాదయ్యా మిత్రమా! మాధవుడన్న వసంతుడని. అతని భార్య మాధవి”.

“అటులనా మహాప్రభూ! అర్థమైనది. నేను మాధవిని వివాహమాడెదను గాక!”

“మేము నీకై యుద్దేశించిన యా బాలికను నీవు గొనిరావలయును. ఆమె యొక్కరిత వచ్చుట గౌరవభంగము. కావున నీ వంశుమతిని గూడ గొనిరావలయును. ఇందు నీ కేమియు నడ్డు రాగూడదు. అట్లు వచ్చిన వారిని హతమార్పుము. ఆ పొట్టిచాళుక్యుని పని నే బట్టించెదను. ఆ కుబ్జుడు వేంగీనగరము వీడి వచ్చునట్లు నే జేసెదను. నీవు తాడిచెట్టునైన విరచి మొగము కడుగుకొను పరాక్రమవంతుడవు... దిట్టలగు వారిని పదిమంది బంటుల గొనిపొమ్ము. ఎటుల దరలించి తెత్తువో ఆ యిరువురి బాలలను! ఇది నా యాజ్ఞ”.

“ప్రభూ! మీరు సముద్రమున నురుకుమన్న నురికెదను. ఆ సముద్రమును ద్రాగివేయమన్నను అట్ల చేసెదను. సాధారణ దళపతి కొమరుని నన్ను మీరు చేరదీసి ప్రియమిత్రునిగ జేసికొన్నారు. మీపై నింతవఱకును నీగనైన వ్రాలనిచ్చితినా?”

“కావున నీవు మూడు ఆరైనను, ఆరు మూడైనను నా బాలిక లిరువురను గొని తేవలసినదే.”

“ఇదిగో పోవుచున్నాను, మహాప్రభూ!”

19

వేంగీపురము నానుకొనియున్న కొల్లేటికి దిగువభాగమునకు “జలసీమ” యనిపేరు. ఆ సరస్సు అతిపురాతనము. భూమితోడనే పుట్టిన దందురు. జలసీమలో నిత్యమును

అడివి బాపిరాజు రచనలు - 6

271

అంశుమతి (చారిత్రాత్మక నవల)