పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చాళుక్య రాజ్యమును స్థాపింప నాశీర్వదించి పంపినాడనియు, దక్షిణకళింగము, వేంగీరాష్ట్రము, పోకరాష్ట్రము నీమూడు రాష్ట్రములను గలిపి వేంగీపురము రాజధానిగ దన రాజ్యమును స్థాపింప బోవుచుంటిననియు, విష్ణువర్ధమడు పల్లవులకు సందేశ మంపినాడు.

18

ఉత్తర కళింగరాజధానియైన కళింగ నగరమున కళింగ యువరాజగు దానార్ణవు డంశుమతీరాకుమారిని పిష్టపురమున నా బాలికకు దెలియకుండగనే తానుజూచిన విషయము నొక్కడు దన యభ్యంతరమందిరమున గూరుచుండి యాలోచించుకొను చుండెను. ఆమె జగదేకసుందరి. ఆమె సర్వకళాభిజ్ఞ, శారద రాకాపూర్ణిమనుగూడ నలుపుసేయగల కాంతిగలది. ఆమెను వివాహమాడ తాను గాఢముగ సంకల్పించుకొని యుండెను. తాను విన్నది, తాను జూచిన దానిలో సహస్రాంశమైన లేదని పిష్టపురమున రాణివాస మందు బంధింపబడిన యా బాలికను జూచినప్పుడే యనుకొన్నాడు. విష్ణువర్ధనుడు వచ్చి పిష్టపురము ముట్టడించు గడబిడలో నాత డా దుర్గమునుండి తప్పించుకొని కళింగమునకు పారిపోయినాడు."

విష్ణుకుండిన మంచనభట్టారకునకు గొమరులులేరు. ఆ ప్రభువునకు దరువాత సింహాసన మెక్కగల సన్నిహిత జ్ఞాతులును నెవ్వరులేరు. ఒక్కగానొక్క కొమరిత మాత్రమున్నది. ఆమెను వివాహమాడినవారి కారాజ్యము హస్తగతమగును. కావుననేకదా పల్లవయువరాజు నరసింహ వర్మయు నా బాలికను నర్ధాంగిని జేసికొన వాంఛించు చున్నాడు. ఆ మఱుగుజ్జు విష్ణువర్థన చాళుక్యుడుగూడ నిట్టి కాంక్షతోడనే తూర్పుతీరమునకు వచ్చియుండవచ్చును. లేనిచో, నంత పటాటోపముగ పిష్టపురమును బట్టినట్లు నంశుమతిని విడిపించినట్లును నాటకమాడు టెందులకు! విష్ణువర్ధనుడు వేంగీపురముపై దాడి వెడలుచున్నాడని తాననుకొనుటవలన గదా తాను బ్రమత్తుడై యుండినాడు! అందు వలననే కళింగసైన్యములును బ్రమత్తములై యుండినవి.

చోళులను బాండ్యులను ననేక యుద్దముల నోడించిన పల్లవ యువరాజు నరసింహ వర్మయు వోడిపోయినాడని, వేగు వచ్చినదిగదా! అందువలన పొట్టిచాళుక్యునకు గర్వము మెండైనది. ఉత్తరదేశ చక్రవర్తి శిలాదిత్యహర్షవర్ధను నోడించగల మేటి పులకేశి పృధ్వీవల్లభు నెదుట తనతండ్రి నిలువలేనిమాట నిజము కావచ్చును. కాని ఈ కుబ్జుడు గూడ బ్రతాపము నెరపుటయేనా? అంశుమతీ బాల వానినెట్లు వరించును! రాయబారములు నిష్పలములైన మీదనే తానిట్లు బలవంతముగ నామె నెత్తుకొని వచ్చుట కేర్పాటు చేయవలసి వచ్చినది. తానా బాలను వివాహమాడినచో గళింగ గాంగ సామ్రాజ్యము కృష్ణాతోయముల నొరసి మహదాంధ్ర సామ్రాజ్యమగును.

తాను కళింగసైన్యము గట్టిపరుపవలయును. ఇంకను బెక్కుసైన్యముల బెంచవలసియున్నది. గాంగుల ప్రతాప మెట్టిదో, చాళుక్యు డిప్పటికైన జవి చూచునుగాక!

ఈ రీతిగ దానార్ణవుని హృదయమున నంశుమతీ కుమారి విశ్వరూపమెత్తినది. మున్ను శ్రీకృష్ణుడు రుక్మిణి దెచ్చినట్లాతడు అంశుమతీ బాలను గొనిరా నిశ్చయించెను.

అడివి బాపిరాజు రచనలు - 6

270

అంశుమతి (చారిత్రాత్మక నవల)