పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/280

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బంగారు పంటలు పండుచుండును. ఈ సీమనంతను బరిపాలించు సామంతుడు బృహత్పాలాయనుండైన పృద్వీశవర్మ. పృధ్వీశవర్మ కిరువురు కొమరులును నొక కొమరితయు గలరు. ఆ కొమరితయే మాధవీలతాకుమారి.

వేంగీరాజ్యము నిప్పుడు పాలించుచున్న మంచనభట్టారక మహారాజు కన్న బృధ్వీశవర్మ యయిదారేడులు పెద్ద. చాళుక్య విష్ణువర్ధనుడు వేంగీనగరము వచ్చునప్పటికి గృష్ణా సముద్ర సంగమతీర సీమలోని సామంతుడొకడు దిరుగుబాటు చేయుటచే పృద్వీశవర్మ వాని నణచుటకు బోయెను. మాధవీలతాకుమారి కలతీర్థ (కలిదిండి) పట్టణమునకు దన తండ్రి వచ్చినాడని తెలిసి తన కుటుంబముతో గొన్ని దినములు గడుపనెంచి కలతీర్థ నగరమునకు బయనమయ్యెను. స్నేహితురాలగు నంశుమతీకుమారిని గౌగలించుకొని ఆమెచే వల్లె యనిపించుకొని పరివారముతో బడవల నెక్కికొల్లేటిపై బ్రయాణము సాగించెను. ఆ సరస్సునందనేక ద్వీపములున్నవి. అందగ్నికులజులైన పల్లెవారు నివసించుచు జేపల పట్టి వేంగీనగరమున అమ్ముచుందురు. ఆ సరస్సున యానము సల్పు బడవల నన్నిటిని వారే నడుపుదురు. ఈ యగ్నికులజు లందఱకు గడు గూర్చువాడు పృధ్వీశవర్మ మండలేశుడు.

మాధవీలతాకుమారి యట్లు ప్రయాణముచేసి “జలకంఠేశ్వరుడు” వెలసిన ద్వీపము జేరెను. ఆ దేవుని దేవేరి జలదుర్గ. ఆ దేవి దేవాలయ మా ప్రక్కనే యున్నది. మాధవీలత యచటికి వచ్చునప్పటికి జెల్లెలికెదురై యామె యన్న త్రినయనేశ్వరుడు భార్యాపుత్రాదులతో నటకుజేరెను. మాధవీలత వదినగారికి అన్నగారికిని పాదములకు నమస్కరించినది. వదినగారా బాలికను దన హృదయమున కదుకొన్నది. మేనల్లుండ్ర నిరువురను మేనగోడలిని నామె యెత్తుకొని ముద్దాడుచుండ బెద్దమేనగోడలు జలదుర్గాంబిక “అత్తయ్యగారూ! వేంగీపురములో బిన్నిగారు, అమ్మమ్మగారు, తాతయ్యగారును క్షేమమా?” యని పలకరించెను.

మాధవీలత పక్కున నవ్వుచు, “ఎంత జాణవమ్మా! ఈ యొప్పిద మెవరు నేర్పిరమ్మా నీకు!” అనునంత, నా యెనిమిదేడుల బాలికయు నత్తగారిని జూచి చిఱునవ్వు నవ్వుచు “నేను మీ కోడలనుగానా?” అని యెదురు ప్రశ్నవేసెను. అందఱును బకపక నవ్విరి..

దేవాలయమున బూజలైన వెనుక యందఱునుగలసి కలతీర్థపట్టణమునకు బోయి చేరిరి. ఆ పట్టణము చుట్టును తోటలే. పండ్ల తోటలు, కాయగూరల తోటలు, పూవుల తోటలును.

మాధవీలత యిరువుర బరిచారికల వెంట దీసికొని నగరము చుట్టునున్న తోటల దిరుగుట కెంతయు ముచ్చట పడును. ఒకనాడాతోటలో నా ఫాల్గుణమాసపు మలయమారుత మనుభవించుచు సాయంకాలమందు చెలులతో మాధవీలత యొక మామిడిచెట్టు క్రింద గూర్చుండి యుండెను. ఏలనో యామెకు జటుక్కున మనోనేత్రముల కొక విగ్రహము ప్రత్యక్ష మయ్యెను. పిష్టపురమునందు దన చెలి మూడు దినము లుపవాసము లొనరించి యొడలు తెలియక పడిపోయినప్పుడు తాను వేగిరపాటుతో భయముతో సిగ్గంతయు విడచి విష్ణువర్ధన ప్రభువుకడకు బరుగిడిపోయినది.

అడివి బాపిరాజు రచనలు - 6

• 272 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)