పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమె కదలక యచ్చటనే నిలుచుండి యా మనోహర గాంధర్వము నాలకించుచు నానందము ననుభవించుచుండెను.

ఏమి యా బాలుని భక్తి పారవశ్యము! ఎంత సుందరముగ నున్నాడు! ఈతని జూచినంతనే తన హృదయ మేలనో యార్ధ్రతనొందుచున్నదని తలపోయుచు నటనే నిలుచున్నది. పాట ముగించుచునే విష్ణువర్ధనుడు తన సమీపమున నెవరో నిలుచుండిరని గ్రహించి యా వైపునకు జూపులు పరపెను. అప్రతిమాన సౌందర్యవతియగు బాలికయోర్తచట నిలుచుండు టాతడు చూచి, తాను కూరుచుండిన మెట్టుపై నుండి లేచి-

“ఎవరు మీరు? ఇచ్చటికి వచ్చినారు?” అని ప్రశ్నించినాడు.

“మీరెవరు? ఇది శుద్ధాంతోద్యానవనము. ఇందు పరపురుషులెవ్వరు ప్రవేశింపరే” ఆమె యతడు బాలకు డనియే యెంచెను.

“రాణివాసము వా రెవ్వరిచట లేరుగదా యని ధైర్యమున నిటకు వాహ్యాళికై వచ్చితిని.”

“మీ మహారాజు రాణివాస మింకను రాలేదా?”

“మా మహారాజనగా?”

“మీరు చాళుక్య శ్రీవిష్ణువర్థన మహారాజు పరివారములోనివారు కారా?”

“అవును! అవును! అయినను పరివారములోని వాడను కాను.”

“అనిన?”

“అవును, పరివారములోని వాడనే కాని, గట్టిగ నాలోచించిన కాను కూడను.”

“మీ మాటలు స్వవచనవ్యాఘాతదోషయుక్తములు.”

“మరి - మరి - నేను రాజబంధువుడను.”

“అదియా! అందుకనియా! మీరింత గజిబిజిపడినారు?”

“మీ రెవ్వరు? శ్రీగంగరాణివాసమువారా? పరస్త్రీతో నిర్భయముగ మాట్లాడు చుంటిని, క్షంతవ్యుడను.”

“మీరుకాదు, మాటలు ప్రారంభించినది నేను. అయినను నేను గాంగరాణివాసపు బాలికనుగాను. నేను - నేను - నేను శ్రీవిష్ణుకుండిన రాజకుమారిక చెలియను. శ్రీవిష్ణుకుండిన మహారాజులకు నేను సమీపబంధువును.”

“క్షమింపుడు. నేనెంతయో తప్పిద మొనరించితిని.”

“ఇందు దప్పేమి యున్నది? మీరును నేనును రాజబంధువులమైనను పరివారజనములోని వారము. మీ నామధేయము నాకు దెలియవచ్చునా?”

“నన్ను ప్రియదర్శి అని మీరు పిలువవచ్చును. మీ మహారాజకుమారి క్షేమముగ నున్నారా? సంపూర్ణారోగ్యము నందినారా?”

“వారు సంపూర్ణారోగ్యము నందినారు. మఱల గౌతమీస్నాన వ్రతమునకు దొందరగ బోవలయునట. ఈ యైదారు దినములు వారు వ్రతము మానివేయవలసి వచ్చినందుకు ప్రాయశ్చిత్తములు జరుపుకొనవలయునేమో! శ్రీ విష్ణువర్ధన మహారాజ కుమారుల

అడివి బాపిరాజు రచనలు - 6

257

అంశుమతి (చారిత్రాత్మక నవల)