పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సేయుచుండినది. ఆ సాయంకాలము కోటి లింగాల క్షేత్రమున నున్న సర్వ బ్రాహ్మణ్యమునకు వివిధ దానము లర్పించి తిరిగి, తన రాజనౌకపై గోవూరు జేరబోవు సమయమున, నామెను, చెలియైన నీ బాలికను ఎత్తుకొని, ఇచ్చటకు దెచ్చి, రాజాంతః పురాంతర కారాగారమున బంధించారట!

విష్ణు: ఎవరా నరరూప నిశాచరులు? కంపన ప్రభూ! మీరీ విషయమంతయు నామూలాగ్రముగ విచారించి, యా దుర్మార్గులెవరో కనుగొనుడు.

కాలకంప: మహాప్రభూ! ఆ బాలికను గొనివచ్చిన నీచులు కాళింగులే! నే నపచెడే యీ రాణివాస పరిచారకులను దీవ్రముగ బ్రశ్నించితిని. గాంగులకు విష్ణుకుండిన రాజ్యము నంతను గబళింపవలెనను దురాశ గలిగినది.

విష్ణు: ఆ దురాశ ఈనాటిది కాదు గదా!

కాల: విష్ణుకుండిన మహారాజున కీమె యొక్కతయే సంతానము. ఈ బాలికను వివాహమాడినచో నల్లుడైన కళింగునకు ఆంధ్ర సామ్రాజ్యమంతయు దత్తమగును గదా?

విష్ణు: అయినచో రాకుమారి హస్తమును కళింగనగర మహారాజర్థించి యుండవచ్చునుగదా!

కాల: ఈ రాకుమారి కళింగ యువరాజు చిత్రము చూచి తనకా యువకుడు తగిన వరుడు గాడని నిస్సంశయముగ దెలిపివైచెనట.

రాజవైద్యు: అదే కారణము మహాప్రభూ! తన్ను వరించదని యెప్పుడు నిర్ధారితమయ్యెనో, కళింగ యువరాజప్పుడే ఈ బాలికను దస్కరించి కొనిపోయి, బలత్కరించి వివాహము చేసికొన నిశ్చయించి, ఈ దౌర్మార్యమున కొడిగట్టినాడు.

విష్ణు: కాలంపన ప్రభూ! విష్ణుకుండిన రాజకుమారి స్వస్థత నొందగనే, వారిని సగౌరముగా గోవూరు కంపి వేయుడు. మూడు దినములలో మన సైన్యములు కళింగ నగరాభిముఖములైయజేయ్యములై జైత్రయాత్రను సాగించుగాక!

కాల: చిత్తము మహాప్రభూ!

12

విష్ణువర్ధనుడు ప్రతి యుషస్సునను దప్పకలేచి తన యుత్తమాశ్వము నధిరోహించి, కొన్ని గోరుతముల దవ్వు అశ్వయానము చేసి తిరిగివచ్చి, యోగాసనాదు లొనరించి, యా వెనుక స్నానము సలిపి సంధ్యావందన మాచరించుకొనును. ఆపై నాతఁడుద్యాన వనవిహారము సేయును. పిష్టపుర మాతని హస్తగతమైన నాల్గవ నాడాతడు తన యలవాటు చొప్పున రాజోద్యానమున విహరించుచు, నా వన మధ్యస్థమైన కృత్రిమ సరోవర సోపానమున గూర్చుండి అలవోకగా నేదియో పాడుకొనుచుండెను. విష్ణువర్ధను డెంత వీరవిక్రముడో యాతని కంఠమంత మధురమై బాలకుని కంఠమువలె పంచమ శృతు లీనుచుండును.

ఆరోగ్యము పూర్తిగా గోలుకొన్న అంశుమతీ రాజకుమారి నిత్యాభ్యస్తమైన యుదయకాల విహారమునకై అప్పు డొంటరిగ నా ప్రదేశమునకే విచ్చేసెను.

ఎవరో యొక బాలుడు, చాళుక్య మహారాజు పరివారములోనివాడు, వన విహారమునకై వచ్చి యానందమున బాడుకొనుచున్నాడని యా బాలిక యనుకొన్నది.

అడివి బాపిరాజు రచనలు - 6

• 256 •

అంశుమతి (చారిత్రాత్మక నవల)