పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“ఒక్కడే అందును.”

“ఈ నవ్యత్వ మాలోచించియే దివ్యకవులైన కాళిదాసాదులు తమ గీతామృత ధారల మాధవదేవుని పలుగతుల కీర్తించిరి.”

ఈ వనీకన్యను వరించి యీ మాధవదేవుడు వచ్చినాడు. మా రాజకుమారిని...”

“ఛీ! మూర్ఖురాలా! నోరుమూయుము.”

“క్షంతవ్యను. మాధవదేవుని రాకచేగదా ఈ నికుంజములు పుష్పభరితము లాయె ననుకొనుచు తొందరలో నటులంటిని.

ఆమాటలకా రాచకన్నియ కోపము నటించి చెలిపై అవతంస కుసుమము విసరినది. మాధవి కిలకిల నవ్వుచు నా పుష్పవాటికి నెందో మరుగై పోయినది.

2

ఒక యుత్త మాజానేయము నధిరోహించి పడుచువాడొకడు మహావేగముతో వేంగీనగరమునకు బశ్చిమముగా నిరువది యోజనముల దూరమున 'మధ్యదుర్గ' మను గ్రామమును దాటి వచ్చుచుండెను. ఉత్తమలక్షణ సమన్వితమైన యా ధవళ పారశీకాశ్వ మెట్టి రౌతునైనను సరకు గొననిది. అట్టిదయ్యు నా యాజానేయము తన కధిక ప్రియము గూర్చు నా యువకుని మనస్సు గ్రహించి, యనువర్తించుచుండెను. గడియ కైదుయోజనముల వేగముతో నా యాశ్వికుడు మధ్యదుర్గమునకు బదిగోరుతముల దూరము ప్రయాణము చేసివచ్చెను. కొండలు, లోయలు, నదీకంఠములు, కొండ దొనలు, కొలకులతో నిండిన యా ప్రదేశము గంభీరారణ్య మధ్యదేశము.

బాలకుడైన యా యాశ్వికు డాగిన మహారాజ పథము ప్రక్క సువిశాల గిరిపాద ప్రదేశమున్నది. అందు శిబిరము లేర్పరచుకొని మహాసైన్య మొకటి దండు విడిసి యున్నది. ఆ బాలకు డచటికివచ్చి, యాగునప్పటి కిరువురు సైనికులు పరుగిడి వచ్చి, చేతులు జోడించి వంగి అతనికి నమస్కరించిరి. ఒకడు గుఱ్ఱము కళ్ళెము పట్టుకొనెను. వేరొకడు కత్తిదూసి సగౌరవముగా విగ్రహమువలె నిలుచుండిపోయెను. ఆతడు గుఱ్ఱముపైనుండి ఛంగున భూమికురికి యా శిబిరములోనికి విసవిస నడిచి పోసాగెను. చక్కని మార్గములు తీర్చియున్న-స్కంధావారములోనికి వేగమున బోవు నాబాలకుని దారిపొడుగునను యోధవీరు లందరు బొమ్మలవలె నిలబడి వీరనమస్కారము లర్పించుచుండిరి.

ఇంతలో నా స్కంధావారాధిపతియైన సేనాధిపతి వేగమున నెదురై వీరనమస్కార

మర్పించినాడు. ఏదియో యాలోచించుకొనుచు, నా బాలకుడు స్కంధావారమధ్యమున బంగరు గుడారమువైపునకు నడక సాగించినాడు అతని వెనుక సేనాపతియు నా బాలకునిపై భక్తియుతములైన చిరు నవ్వుల బరపుచు ననుసరించినాడు. బాలకు డా గుడారము చేరబోవుసరికి నచ్చట బారులుదీరి మాగధులు వందులును “జయ! జయ! ఉత్తమ చాళుక్యా! జయ! జయ! కదంబమహారాజ గర్వాపహరణ! జయ! జయ! బిరుదాంక భీమ! జయ! జయ! రాష్ట్రకూట గోవిందరాజ గర్వాపహరణ! జయ! జయ! త్రిమహారాష్ట్రక ప్రభూ! జయ! జయ! విషమసిద్ధి దివ్యబిరుదాంకా! జయ! జయ! విష్ణువర్ధన మహారాజా!” అని జయ ధ్వానములు సలిపిరి.

అడవి బాపిరాజు రచనలు - 6

233

అంశుమతి (చారిత్రాత్మక నవల)