పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇట్లు విష్ణువర్థన మహారాజును పట్టవర్ధన వంశతిలకుడగు కాలకంపనుడను సేనాపతియు నా గుడారములోనికి బోయినారు. విష్ణువర్థన మహారాజు సువర్ణాసన మధివసించి, “కాలకంపన ప్రభూ! ఆసన మధివసింపు" డని గౌరవముట్టిపడు మాటలతో సేనాధిపతికి పీఠము జూపినాడు.

విష్ణువర్థనుడు రాజపరమేశ్వర, సర్వసిద్ధి బిరుదాంక, సత్యాశ్రయ శ్రీపృధ్వీవల్లభ వాతాపినగర చక్రవర్తికి జిన్నితమ్ముడు. అన్నగారి కన్న నెనిమిదేండ్లు చిన్నవాడై నేటి కిరువదెనిమిది సంవత్సరముల ప్రాయమువాడై యున్నను, రూపమున బాలకునివలె నుండెను. ఆతడు నాలు గడుగుల పదనొకం డంగుళముల పొడవువాడు. వాతాపినగర చాళుక్య చక్రవర్తు లందరును నారడుగుల పొడవువారు. చాళుక్య రాజపుత్రులలో నిట్టి పొట్టివా డెన్నడును బుట్టలేదని ప్రజలనుకొను చుందురు. ఆ పొడవునకు సరితూగు నంగములు కలిగి చారుశరీరి యగుటచే విష్ణువర్థన నామములు గలవారున్నారు. వాతాపి చక్రవర్తుల మూలపురుషుడే విష్ణువర్థనుడు. అందుచే గాబో లీతనిని గుబ్జ విష్ణువరథనుండని పిలుచు కొందురు.

పచ్చని బంగారుచాయ, పదునారేండ్ల వయసు మిసిమిచే వెలుగు నాతనిమోమున నూనూగుమీసలు గాంచినవారాతని బాలకు డనియే యనుకొందురు. అయినను విష్ణువర్థనుని శరీరాంగకము లుక్కుతో నిర్మించినవి. ఇనుప గుదియనైన నాత డుంగరమువలె వంచివేయునట. పొడగరులై రాక్షసులవంటి దిట్టరులు విష్ణువర్థను నవలీలగ నోడించవచ్చునని యాతనితో ముష్టి మల్లయుద్ధముల దలపడి మూడు నిమేషములలో ప్రాణములు కడబట్టి, బ్రతుకుజీవుడా! యనిదాసోహ మందురట.

ఆతని బాణప్రయోగములు, ఆతని కత్తివ్రేటులు విద్యుద్వేగములు. శార్ణకోదండ వినిర్ముక్త బాణములవలె తీవ్రములు.విష్ణువర్థనుడు భయమన్న నెఱుంగడు. తానోడి పోదునన్న సంశయ మెన్నడును నాతనికి బొడమలేదు. సైన్యము నడుపుటలో, వ్యూహమును బన్నుటలో, నెదిరి బలములను దాకుటలో కుబ్జవిష్ణువర్థనుడు ప్రజ్ఞావంతుడగు సేనాపతి. తన బలముకన్న శత్రువులసైన్య మెంత యధికమైనను యుద్ద నిర్వహణమునందు బగతురు తన కెప్పుడును తక్కువ వారను నమ్మక ముండుటచేతనే విష్ణువర్ధనుడు మేకలమందపైబడు సింహమువలె బ్రళయ ప్రభంజనమై వైరులపై విరుచుకొని పడును.

కాలకంపనుడు:మహాప్రభూ! సార్వభౌములు తమ చిన్నన్నగారైన సత్యాశ్రయ శ్రీ జయసింహ మహారాజును సురాష్ట్ర, కుకుర్త, అనుప - అపరాంత దేశములకు మహారాజుగా జేసి పట్టము గట్టినారు. తాము కుంతల దేశమును జయించినారు. అశ్మక నడంచినారు. రాష్ట్రకూటులను బాదాక్రాంతులుగ జేసినారు. వనవాసి దేశమునకు దాము ప్రతినిధులై యుండిరి. మరి, అడుగడుగునకును నడ్డుతగులు నీ పూర్వ సముద్రతీర రాజ్యములకు బుద్ధి చెప్పుడని ఇప్పుడేల వారు పంపిరో నా కవగత మగుటలేదు మహాప్రభూ!

విష్ణువర్థనుడు:సేనాధిపతీ! అన్నగారు దివ్య ప్రతిభావంతులు.వారి హృదయము అవగతముసేసికొనుటకు బృహస్పతులైనజాలరు.రాజ్యములు సుస్థిరములై ప్రజలు రామరాజ్యము లనుభవింపవలెనని ఎప్పుడును వారు గోరుచుందురు.

అడవి బాపిరాజు రచనలు - 6

234

అంశుమతి (చారిత్రాత్మక నవల)