పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరల నుగ్రతప మొనర్చెను. ఆ తపమునకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమయ్యెను. ఆ మహేశ్వరుడు తన జటాజూటము విప్పి భూమికి మహావేగమున వ్రాలి వచ్చు మందాకినీ నదిని తన జడలలోనికి గ్రహించినాడు. ఆ దివ్యనదిలో నొక పాయను మాత్రము పరమేశ్వరుడు భూమిని పూతమొనరించుటకై వదలినాడట. అప్పటినుండియు గంగను జటాజూటమున ధరించి శివుడు గంగాధరుడైనాడుజ భగీరధుడు గంగను భూమి నవతరింపజేయుటచే నా దివిజనది భాగీరధియైనది.

ఉత్తర భారతదేశమునందు ఈ మహోత్తమసంఘటన జరిగిన కొన్ని యుగములకు, పరమశివుని యవతార మొక్కటి వింధ్యపర్వతము దాటి దక్షిణాపథమునకు వచ్చి, పశ్చిమాద్రియందు ప్రత్యక్షమయ్యెను. అచ్చట నా శంభు దేవుడు త్య్రంబకేశ్వరుడై వెలసెను. ఆ దినములందే దండకారణ్యమున నేటి గోవూరు ప్రాంతమున గౌతమమహర్షి తన యాశ్రమము నిర్మించుకొని తపం బాచరించుకొనుచుండెనట. ఆ ప్రదేశమున మాత్రము వర్ష మెల్లప్పుడు కురియుచుండెనట. ఆ వానలే పంటల కాధారములట. కావున ఆ సీమ నాదిమ నివాసులగు ఆంధ్రు లుపాయమును బన్ని గౌతమమహర్షి యాశ్రమములోనికి గోవు నొకదానిని తోలిరట. ఏనాటి కానాడు పండు వరి చేను నాగోవు మేసిపోవుచుండ గౌతముడు దాని తరిమివేయ నొక దర్భపుల్లను విసరినంత మహర్షి తపోబలంబున నాయావు మరణించి నేలఁగూలినది.

గోహత్యా మహాపాతకము గౌతముని జేరవచ్చినది. ఆ పాపమును నాశనము జేసికొనుటకు నా ఋషిసత్తముడు దీక్షతో తపమ్ముసలుప బ్రహ్మ ప్రత్యక్షమైనాడు. త్య్రంబకేశ్వరమునకు జని యచ్చటవెలసిన పరమశివుని జటలో నున్న గంగను గొనిరా బ్రహ్మ ఆతని నియమించెనట. గౌతము డా త్రినేత్రుని వేడి యభ్రగంగలో వేఱొక పాయను గొని వచ్చెను. గోహత్యాపాతకము నాశనము జేసినది గావున గోదావరి యనియు, గౌతముడు కొనివచ్చెనుగాన గౌతమి యనియు నా దివ్యనదికి బ్రసిద్ధనామములు వచ్చినవి. గోవు చనిపోయిన ప్రదేశము గోపాదక్షేత్రము. అచ్చట వెలసిన మునిపల్లె గోవూ రయినది.

రాజకుమారి గోదావరీస్నాన వ్రతము నిర్విఘ్నముగ సాగుచున్నది. ఆ సాయంకాలమున నొంటిగా భవనోద్యానమున నాభాల విహరించుచు నూత్న పరీమళమూర్తియై అప్పుడే యా వనవాటికను బ్రవేశించిన వసంతదేవుని నవ్యవిలాసముల గమనించి “మాధవీ! యిటు ర” మ్మని చెలిని బిలచెను. ఆమె మాటలోని తొందరపాటును యిష్టసఖి, “ఏమి రాజకుమారీ! ఏదియో వింత గనినట్లుంటి” వనుచు బరుగిడి దఱిచేరెను.

“మాధవీ! ఈ మల్లెపొద మొగ్గలు దొడిగినది. ఆ గున్న మామిడి లేబూత నలంకరించుకొనుచున్నది. వాయు దేవుడు గంధవహు డగుచున్నాడు చూచితివా.”

“రాకుమారీ! ఏ సంవత్సరమున కా సంవంత్సరము వచ్చు వసంతదేవు డొకడా లేక యనేకు లందువా?”

“ఓసి వెఱ్ఱిదాన! వసంతుడు నిత్యయౌవనుడు నిత్య లీలావిలాసుడు. ప్రాతఃకాలమున నుదయించి ముప్పది గడియలు నభోమండలమున బరిభ్రమించి సాయంకాల మస్తాద్రిని జేరు సూర్యభగవాను డొక్కడందువా వేవు రందువా?”

అడవి బాపిరాజు రచనలు - 6

232

అంశుమతి (చారిత్రాత్మక నవల)