పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“మహాప్రభూ! బ్రహ్మదత్తప్రభువు, భర్తృదారికా చేయి చేయి పట్టుకొని మహాప్రభువుల దర్శనార్థము వస్తున్నారు” అని మనవి చేసినాడు.

శాంతమూలుని హృదయం ఒక్కలిప్త గతితప్పింది. చెంత గ్రంథ పఠనం చేస్తున్న పండితుని “ఉండండి స్వామీ” అని నిలిపి, పీఠంనుండి లేచినాడు. ఆయన మోమంతా ఆనందంతో వెలిగిపోగా గంభీరంగా నడుస్తూ ఆ మందిర కవాటం దగ్గరకు వచ్చేసరికి అప్పుడే బ్రహ్మదత్తుడూ శాంతిశ్రీయున్నూ వచ్చినారు.

చక్రవర్తి ఎదురుపడగనే వార్కొక్షణికం చకితులై “జయము జయము మహాప్రభువులకు” అని మోకరిల్లినారు. “దీర్ఘాయుష్మాన్‌భవ! సత్వర వివాహప్రాప్తిరస్తు బహుసంతాన ప్రాప్తిరస్తు!” అని చక్రవర్తి ఆశీర్వదించినారు. ఆ వెంటనే వారిరువురను లేవదీసి చెరియొక ప్రక్క అక్కునచేర్చి, “శాంతీ! ఈనాటికి నాకు నువ్వు ఆనందం సమకూర్చినావు తల్లీ!” అన్నారు. బ్రహ్మదత్తప్రభు! ఈ నాతల్లిని, నీ బ్రహ్మవిద్యలా కాపాడుకో నాయనా!” అని చక్రవర్తి కొమరిత చేయిని బ్రహ్మదత్తుని చేతిలో పెట్టినారు.

ఆ సాంఖ్యాయనస గోత్రజుడు, భరద్వాజుడు ధనకప్రభువు హారీత గోత్రజ మాఠరీపుత్ర శాంతిశ్రీకుమారి చేయి పట్టుకొని పట్టమహిషి అంతఃపురంలోనికి పోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో వీరపురుషదత్తుడు పూంగీయ శాంతిశ్రీయు అచ్చటికి చేయిచేయి పట్టుకుని వచ్చినారు. చక్రవర్తి ఆశ్చర్యంతో లోనికిపోయేవారు పోక అట్లే నిలిచిపోయినారు. ధనక ప్రభువు, శాంతిశ్రీయు నిలిచిపోయినారు. వారిరువురూ చక్రవర్తి పాదాలకడ మోకరించినారు. పూంగీయ శాంతశ్రీ “మామయ్యగారూ! మీరు మా వివాహం జరుప నా చిన్నతంలోనే మాట ఇచ్చారు. బావగారికి పట్టమహిషి వచ్చింది. ఇంక మా వివాహానికి అభ్యంతర మేమిటి? నేను బావగారిని విడచియుండలేను అని తలవంచుకొని నిర్భయంగా చెప్పినది. “సౌభాగ్యవతివై వర్థిల్లు తల్లీ! ఈ శాంతికికూడా వివాహం నిశ్చయమైంది. మీరూ మహారాణుల ఆశీర్వాదం పొందండి” అని చెప్పి ఆనందంతో వారి తలలపై చేయినిడి, మోకరించిన ఆ యువతీ యువకులను పైకి లేవదీసినారు.

(5)

నాగార్జునదేవుడు శాంతిమూల సార్వభౌమునికి పట్టాభిషేకం చేసి మరల కొండమీద తన ఆశ్రమానికి వెళ్ళిపోయినారు.

ఆ మహర్షి శాంతిమూలునికీ బ్రహ్మదత్తునికీ ఇక్ష్వాకు రాజకుమారి శాంతిశ్రీకీ, మహాసామంతులకు, సేనాపతులకు, అర్హతులకు, ఆచార్యులకు, దేవదత్తాది ఋషులకూ నూరుమందికి తన యాశ్రమమునకు రావలసిందని ఆహ్వానము లంపెను.

నాగార్జున దేవుడుంచిన ముహూర్తమునకు ఆహ్వానితులందరు కొండ ఎక్కి స్నానాదికాలు చేసి భిక్కులందిచ్చిన శుభ్రవస్త్రాలు ధరించి మహర్షి మందిరంలోనికి పోయి సాష్టాంగ నమస్కృతు లాచరించి, వారి అనుజ్ఞను ఉచితాసనాలపై అధివసించినారు.

“మీకందరికీ నా ఆశీర్వాదాలు. నేను ఈ దేహం చాలిస్తున్నాను. శాంతిమూల చక్రవర్తీ! నేను భూలోకంలో చేయవలసివచ్చిన కార్యాలన్నీ చేశాను. ఇంక సిద్దలోకం

వెళ్ళవలసిన శుభమూహూర్తం వచ్చింది. ఈ ఆశ్రమాదులు చైత్యాలు అభివృద్ధిపొంది

అడవి బాపిరాజు రచనలు - 6

221

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నావల)