పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ధనకప్రభువు ఆశ్చర్యమందినాడు. ఆనందముచే అతని మోము ఉదయారుణకాంతి రంజిత హిమాచలశృంగంలా వెలిగిపోయినది. ఆతడును ఆమె కడ మోకరిల్లి “దేవీ! నేను నిన్నింత చిన్ననాటినుండి ప్రేమించినాను. చిరుబాలికవైన దినాలలో నిన్ను ఏకాంతాన పూజించుకొంటిని. నీవు నా హృదయస్థదేవీమూర్తివి.

“నీవు ఈ లోకంతోపాటుకాక శాపవశంచే నరజన్మ తాల్చిన దేవతవలె నుంటివి. నీ కరగ్రహణము చేయలేని, నీ సాన్నిధ్యం పొందలేని నేను భక్తుడుగా జీవితం గడుపు దామనుకొన్నాను. దేవీ! ఇంతలో నీకు గురువైనాను. నేను నా సర్వస్వముతో ప్రేమిస్తూ- నీ సాన్నిధ్యవరానికే పరమేశ్వరునికి హృదయంలో సకమాలింగిత భూతలుణ్ణి అవుతూ - ఆ మహదానందంతో నీకు పాఠాలు చెప్పినాను.

“దేవీ! నీవు నన్ను ప్రేమిస్తున్నావన్న నిశ్చయమూ కలిగింది. లేదేమోనన్న భయమూ కలిగేది. నా జీవితేశ్వరివి... నా ఆరాధ్యదేవతవు! నాకు ఈ దినం అతి పవిత్రం!”

(4)

శాంతిశ్రీ కన్నుల నీరు తిరిగిపోయినది, ఆమె ఆనందంతో ఉప్పొంగినది. కన్నులనీటిలో తళతళ మందహాస కాంతులు ప్రసరించినవి. ఇరువురును ఒకరి కన్నుల నొకరుచూస్తూ, ఒకరిచేతులు నొకరు పట్టుకొనిలేచినారు. “ప్రభూ!” అని శాంతిశ్రీ “దేవీ!” అని బ్రహ్మదత్తుడు! ఆ పైన వారికి మాటలు లేవు. అయస్కాంతాకర్షణచేవలే ఒకరికొకరు దగ్గరకు మరియు దగ్గరకు వచ్చినారు. మరునిమేషాన శాంతిశ్రీ బ్రహ్మదత్తుని కౌగిలింతలో గాఢంగ ఇమిడిపోయింది. ఆ పరమసుందరి అతని పెదవులకు పరిమళామృత పూర్ణధరోష్ఠము అందిచ్చినది. అతడు సర్వసృష్టిని మరచి ఆ పెదవి నాఘ్రాణించాడు. ఆ బాలికను సువ్వున ఎత్తుకొనిపోయి, బ్రహ్మదత్తుడు అక్కడనే ఉన్న ఒకపీఠం అధివసించి ఆమెను ఒడిలో కూర్చుండబెట్టుకొని ఆమె చిబుకము, కపోలాలు, ఫాలము స్పృశించినాడు.

“ఇంతటి ప్రేమ నీలో దాచుకొని, రత్నగర్భలా ఏమీ తెలియని దానిలా ఉంటివేమి దేవీ!”

“మీరు మాత్రం గాఢప్రణయమూర్తులై ఉండిన్నీ, అమృతాన్ని తనలో దాచుకొన్న సముద్రంలా ఎంత గంభీరంగా ఉన్నారు, ప్రభూ!”

“శిష్యురాలు గురువునకు మాటకు మాట ప్రతిచెప్పవచ్చునా?”

“చెప్పకపోతే చదువు చదువనేరనిదాన నవుతానుకదా?”

వారు తమ కౌగిలి విడిపోయి ఒకరిచేయి ఒకరు అందిపుచ్చుకొని తిన్నగా నడిచి మందిరాలు దాటి చక్రవర్తి హార్మ్యాలలోనికి దారిపట్టినారు. దారి పొడుగునా దాసదాసీజనము, కంచుకులు, ద్వారపాలకులు అందరూ ఆనందమయులై నడిచిపోయే యువతీయువకుల్ని చూచి, వంగి నమస్కరిస్తూ ఆనందాశ్చర్యాలక లోనవుతూ “అమ్మయ్యా! ఎంతటి ఆనందం కనుల బడింది!” అని ఒకరి కొకరు సైగలు చేసుకుంటున్నారు.

ఈ యువద్వయం అలా తిన్నగా చక్రవర్తి మందిరాని కరిగిరి. వారిని గాంచి

ద్వారపాలకుడు లోనికరిగి, సాష్టాంగముగా నమస్కరించి, లేచి చేతులు కట్టుకోని

అడవి బాపిరాజు రచనలు - 6

220

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)