పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలరారుచున్నది. ఆ డేరాలోనికి పులమామి ప్రవేశించినాడు. తాను నిద్రించే ప్రదేశానికి తెర ఈవల నిలుచున్నాడు.

“నేను వస్తున్నాన్. నీ అందమైన దేహం నా స్పర్శతో ముడుచుకు పోతుందా?” అంటూ తెరలోనికి అడుగిడబోయి “ఆ! బుద్ధప్రభూ” అంటూ కుడిచేయి గుండెమీదవైచి నొక్కుకుంటూ తూలి విరుచుకుపడిపోయినాడు. దాసీది 'సార్వభౌమా! సార్వభౌమా' అంటూ క్రింది రత్నకంబళిమీద పడిపోయిన పులమావి దగ్గర కూర్చున్నది పులమావి కళ్లు తిరిగిపోతున్నాయి. నోట రక్తం వస్తున్నది. 'అయ్యో చక్రవర్తికి జబ్బు చేసిం’ దంటూ పొలికేకలు పెట్టింది. దాసీలెందరోపరుగిడి వచ్చారు. అక్కడేఉన్న ఒక పల్యంకంపై పులమావిని పండుకొనబెట్టిరి. వైద్యుడు పరుగునవచ్చి చూచాడు. పులమావి దేహంలో ప్రాణంలేదు. ఒకదాసి తెర ఒత్తిగించి పడకగది చూచింది. తల్పంపై నగ్నసుందరిలేదు.

8

“ఏమిటి నువ్వు శాంతిశ్రీవా?” అని పులమావి రాణి ఆ బాలికను అడిగింది.

“అవునమ్మా అవును. నన్ను నీ భర్త ఏమీ చేయలేడని సంపూర్ణ నమ్మకం. నన్ను పరమశ్రమణకుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు.”

ఎప్పుడు దాసీలు శాంతిశ్రీని నగ్ననుచేసి పల్యంకానికి కట్టిపోయినారో ఆ వెంటనే పులమావిరాణి ఆ శిబిరంలోకి చక్కావచ్చింది. ఆ బాలిక పాండ్యుల ఆడబడుచు. భర్త దుర్నీతి ఆమెను దహించి వేస్తున్నది. ఇక్ష్వాకు రాజులకు లోబడి రాజ్యం చేసుకోవలసిందని ఆమె భర్తకు వేయివిధాల చెప్పి చూచింది. కాని ఆ దుష్టబుద్ది ఆమె ఆలోచన ఆవగింజంతైనా వినలేదు.

ఆ శ్వేతశ్రీదేవి శాంతిశ్రీ రాకుమారిని చూచి కన్నులనీరు తిరుగ ఆమె కట్లన్నీ విప్పి వేసి ఆమె సౌందర్యానికి తానే ఆశ్చర్యపడుచు తాను తెచ్చిన చీర కట్టి మేలిముసుగువైచి తన శిబిరంలోనికి తీసుకుపోయినది. ఇంతలో 'పులమావి మహావాతంచేసి పడిపోయినాడు' అని ఒక దాసీ పరుగున వచ్చి తెలిపినది.

రాణి “అయ్యో” అంటూ ఆ వెంటనే పరుగుపరుగున పులమావి శయన శిబిరానికి వచ్చి వాలింది. పులమావిపై వాలి అతడు విగతజీవుడైనాడని వెంటనే గ్రహించినది. “ఏమయ్య! ఏమిటిది?” అని వైద్యుని ప్రశ్నించినది. వైద్యుడు తలవాల్చినాడు. ఆమె “పరమశివా” అని విరుచుకు ఆ శవముమీదే పడిపోయింది. శాంతిశ్రీ రాకుమారి కదలక రెప్పవాల్చక అటులనే చూస్తూ నిలబడిపోయింది. అప్పుడు తృణావర్తంలా, సుడిగుండంలా, మండుతున్న కొరివిలా ఒక బాలిక ఆ గదిలోనికి పరుగెత్తుకొని వచ్చింది.

“నా ప్రభువు చనిపోయినాడా? ఈ రాక్షసి, ఈ తాచుబాము, విషపుకుండ నా మహారాజును చంపిందా? ఓసీ! రాక్షసీ నువ్వెందుకు దాపరించావే! మొదటినుండీ నీ

కోసం మా చక్రవర్తి, మా జగదేకవీరుడు వెఱ్ఱివాడై పోయినాడు. ఓసి పిశాచీ, ఢాకినీ! నా చక్రవర్తిని పొట్టబెట్టుకున్నావా?” అంటూ మొలనుంచి బాకును సువ్వునలాగి శాంతిశ్రీపై బడింది. శాంతిశ్రీ మాటలాడలేదు. చిరునవ్వుతో అలాగున నిలుచున్నది. ఆ నూత్న

అడవి బాపిరాజు రచనలు - 6

214

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)