పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కక్కుతూ ఆజ్ఞ ఇచ్చినాడు. శాంతిశ్రీని ఆ పైశాచికాంగనలు బరబరలోని గుడారములోనికి లాగికొనిపోయారు. ఆమె కన్నులు మూసికొని, వారేమి చేసినా మాట్లాడక ఊరకొన్నది. ఆ బాలిక వస్త్రాలన్నీ ఒలిచివేసినారు. స్వచ్ఛ హిమాలయ శిఖరంపై బంగారు కిరణాలు ప్రసరించినట్లున్న ఆమె దేహంలో చైతన్యమేలేదు. ఆ పైశాచికాంగనలు ఆ బాలికను మంచంపై వెల్లకిలా పరుండబెట్టి చేతులు తలవైపు రెండుకోళ్లకూ, కాళ్లను దిగువవైపు రెండు కోళ్లకూ కట్టివేసిరి.

ఆమె దివ్యసౌందర్యం పందులవంటి ఆ ఆడవాళ్లకు రాక్షసత్వాన్ని ఎక్కువ చేసింది. కొందరు స్త్రీ లామెను కసికొద్దీ గిల్లినారు. ఆ బాలిక కన్నులు మూసుకొనే ఉన్నది. మాటలేదు. ఆమె మోము నిర్మల నీలాకాశంలో పూర్ణ చంద్రబింబంలా ఉన్నది.ఆమె మోము ధవళకాంతి ప్రజ్వలిత హిమాలయశిఖరంలా ఉంది. ఆమెమోము వేదమంత్రంలా ఉన్నది, ఆమె మోము బుద్ధదేవ పవిత్ర హస్తతలంలా ఉన్నది. ఆ స్త్రీలు తమ పని నిర్వర్తించి వెళ్లిపోయారు. ఒకతెపోయి సార్వభౌముని ఆజ్ఞ నిర్వర్తించినామని మనవిచేసింది పులమావితో. పులమావి ద్రాక్షసారాయం సేవిస్తూ అభ్యంతరమందిరంలో తాను సాధించబోయే మహావిజయానికి తగిన బలం చేకూర్చుకొంటున్నాడు. అతని కళ్లు చింతనిప్పులులా ఉన్నాయి. మనుష్యమాంసం తినబోయే రాక్షసుని హృదయంలా అతని కామకాంక్ష వికటతాండవం చేస్తున్నది.

దొరికింది రాక్షసి! ఎక్కడకు పోతుంది? ఎవ్వరు అడ్డంరాగలరు, మహాశక్తిమంతుడైన పులమావిని అవమానించి ఎవరు బ్రతుకగలరు? అతడు ఒంటినిండ సువాసనద్రవ్యాలు పులుముకున్నాడు. దాసీలు అందిచ్చిన సువాసన తాంబూలం నమిలివేశాడు. పైనున్న ఉపవీతం అవతల గిరవాటు వేసినాడు - నడుముననున్న మణులు పొదిగిన పిడిగల బాకును తీసిదూరంగా నిసరివేసినాడు. రొమ్ము విరిచి ముందుకుచూచి, “ఒసే దాసీ! మేము అందంగా లేమటే?” అన్నాడు.

“మీరు లోకాద్భుత సుందరులండీ చక్రవర్తీ!”

“అయితే మమ్ము ఎందుకు ఆ రాక్షసి పెళ్లి చేసుకోనంటుంది?”

“అది వట్టి పిచ్చిదండి సార్వభౌమా!”

“ఛీ దుర్మార్గురాలా! ఇప్పుడు మేము గాంధర్వంగా వరించబోయే పడుచును పిచ్చిదంటావా?”

“శాంతిశ్రీ రాజకుమారి కాదండి పిచ్చిది, నేనండి” అంటూ వణికిపోయింది.

“నువ్వుకాదు మేము పిచ్చివారము. ఈ శాంతిశ్రీ అందంగా ఉంటుందా?”

“చిత్తం సార్వభౌమా!”

ఆ దాసీదాని భుజంమీద చేయివేసి, తూలుతూ “దారి చూపించు మాకు” అన్నాడు. ఆమె జాగ్రత్తగా పులమావిని ఆ నగ్నసుందరిని కట్టి ఉంచిన శిబిరం కడకు తీసుకొని పోయింది. ఆ శిబిరం రెండుగదులుగా విభజింపబడియున్నది. ఆ శిబిరం పులమావి

స్వయంగా నిద్రించే డేరా. ఆ డేరా పట్టుతోకుట్టి ముత్యాల అంచులతో, చిత్రములతో

అడివి బాపిరాజు రచనలు - 6

213

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)