పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అప్పుడు బ్రహ్మదత్త మహారాజు స్వయంగా వచ్చాడు ఇప్పుడీ శుంఠయెవడో వచ్చినాడు. వీళ్ళను ఆదరించక వెంటనే విషపు పురుగులను నాశనం చేయాలి అని యెంచి "ఓయీ సేనాపతీ! ఈవెఱ్ఱి వానిని స్కంధావారంమధ్య కోటలోని వారికి కనపడేటట్లు ఎత్తైన మంచెపై తలతెగవేయించు. కోటలోని వారికి నా ఆజ్ఞగా ఇట్లు తెల్పు.”

“మీరు ఆడవాండ్రమాటలు వినక, కోటను మాకు ఒక జాములో స్వాధీనం చేయవలసినది. అలా చేయకపోతే ఈ నగరం యావత్తూ గోదావరిలో కలిపి, మగపురుగు లేకుండా హతమార్చి, ఆడవాళ్ళని మా సైనికులకు ఉంపుడు కత్తెలుగా ఇచ్చివేస్తాము. లేదా ఇక్ష్వాకు శాంతిశ్రీ ఒకర్తె మాకు ఈలోపల ఉంపుడుకత్తెగా రావలసినది. ఆమె రానని నిరాకరిస్తే నగరవాసులు ఆమెనుపట్టి పట్టి బందీగా అప్పగించవలసినది” అని ఆదేశించెను. ఈ ఆజ్ఞ కోటలోవారికి వినబడేటట్లు పులమావి మాగధులు వినిపించారు.

ఒక క్షణికం గడిచింది. రెండు క్షణికాలు గడచినవి. పదునైదు విఘటికలు గడచిపోయినవి. కోటగోడలనుండి ఒక తాడు నిచ్చెన క్రిందకి వాలింది. ఆ గోడల పైన ఎవరూ కనపడలేదుగాని ప్రతి లగ్గలపత్రం వెనుకా ధనుస్సు ఎక్కుపెట్టి వీరాంగనలు గరుడుని చూపులతో విరోధుల గమనిస్తూ గాలయినా పీల్చకుండా శిల్పాలులా ఉన్నారు. తాడు నిచ్చెనకడ ఒక యువతి తెల్లని దుస్తులు ధరించి సంపూర్ణభూషణ భూషితురాలై కనపడింది. ఆమె అతివేగంగా నిచ్చెననుండి కందకము వరకు దిగి, నీళ్ళలో ఉరికింది. ఆ నీళ్ళలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చింది. ఒడ్డుకు రాగానే ఒకసైనికు డామెకుచేయి అందిచ్చి లేవదీయబోయినాడు. వెంటనే ఒక నిశితమైన బాణం సువ్వున వచ్చి చాచిన ఆతని చేతిని దూసుకుపోయింది. ఆ భటుడు కెవ్వున కేక వేసెను కత్తులుదూసి పదిమంది భటులు ముందుకురకబోతే బాణాలు వచ్చి వారివక్షముల నాటుకున్నాయి. అందరూ ఆగిపోయారు. ఆ యువతి తోడనే గట్టెక్కి తడిబట్టలు తన దివ్య సౌందర్యమును ఇనుమడింప జేయగా, నడుమున కట్టుకొన్న మైనపుసంచి ముడి సడలించి అందులోనుండి ఒక శాలువ తీసి కప్పుకుంది.

“మీరంతా మా జాగరూకత చూచినారుకదా! నా జోలికి ఎవ్వరూ రాకండి. నేను చక్రవర్తి శాంతిమూల సార్వభౌముని తనయను. నాతో మాట్లాడి, నన్ను బందిగా పట్టుకు వెళ్ళదలచుకున్న పులమావి దగ్గరకు నాకు దారిచూపండి” అని కత్తి తళుకులవలె మాటలాడింది. మహాశరమును చూచిన వారివలె ఆమెను చూచిన వారు గజగజ లాడిపోయినారు. సేనాపతి ముందు దారి చూపుచుండగా శాంతిశ్రీరాకుమారి అదృష్ట దేవతలా, విధినిలాసములా, మహామంత్రములా, మహర్షి శాపములా అతని వెనుకనే నడిచి పోయింది. పులమావి గుడారములోకి వెళ్ళగానే రక్కసిమూకలా ఆడవాళ్ళు కొందరు ఆమె చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఆమె నడుముచుట్టూ కత్తికట్టారు, బాకు ఉందేమో పరీక్షించినారు. పులమావి ఆమెవైపు రెప్పవాల్చకుండా చూస్తూ నిలుచుండినాడు.

(7)

“దీన్ని నా శయ్యాగృహంలో చేతులూ, కాళ్ళూ కట్టివేసి నోట్లో గుడ్డలు కుక్కి దెసమొలగా ఉంచండి” అంటూ పులమావి పళ్లు బిగించి, కళ్ళ వెంట పైశాచికకాంక్షలు

అడివి బాపిరాజు రచనలు - 6

• 212 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)