పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెదవుల్ని ముద్దు పెట్టుకొన్నాడు. యశోద చేతులూ ఆప్రయత్నంగా ఆ యువకుని మెడచుట్టూ చుట్టివేశాయి. ఇంతట్లో వీరిద్దరూ కూర్చున్న గున్నమామిడి వెనక కొంతదూరంలో “పక పక”మని నవ్వు వినబడింది. చటుక్కున ఇద్దరూ లేచి ఒకరికొకరు దూరంగా వెళ్ళిపోయినారు. యశోద గున్నమామిడి నీడనుంచి తుర్రున పిట్టలా ఎగిరి పోయింది.

వినయనాగుడు ఎంత చూచినా ఎవ్వరూ కనబడలేదు. అయ్యయ్యో మంచి రసకందాయపు పట్టులో విఘ్నేశ్వరుడు చూచినాడురా అనుకుంటూ, అయినా నయమే. తనవారి కళ్ళపడితే తన్నేమి అనుకుంటారో అనుకుంటూ హృదయం పూలపాటలు పాడుతూండగా తోటపైకి వచ్చి, కృష్ణ ఒడ్డునే కట్టివేసి ఉన్న బళ్ళ దగ్గరకు వెళ్లినాడు. ఆ బళ్లు తోలుకు వచ్చిన వారిలో నాగదత్తుడు కూర్చుండి వంటలు చేయిస్తున్నాడు. అడపిల్లలందరూ వంటపనులలో గడబిడలు చేస్తున్నారు.

అందరూ వంటకు సిద్ధం. అందరూ కూరలు తరిగేవారే! అందరూ బియ్యం కడిగేవారే. ఒకరికొకరు అడ్డం. నాగదత్తుడు వాళ్ల అల్లరి హంగామా చూచి, “అందరూ వంటకు సిద్ధమయితే మాకు ఈ పూట భోజనం వచ్చిందన్నమాటే!” అన్నాడు తారానిక అందుకుని “మీకు భోజనం లేదులెండి” అన్నది.

ఎక్కడనుంచి వచ్చిందో యశోద “మా అన్నయ్యకు ఇప్పుడే వండిపెట్టనంటున్నావు! పెళ్లయితే వరస ఉపోషాలు కాబోలు” అంది.

“ఆ! నువ్వు మీ ఆయనకు నిత్య వనసంతర్పణలు గున్నమామిడి క్రింద వండిపెడిదువుగానిలే!” అంది.

యశోద చూచిందిరా బుద్ధదేవుడా అని తెల్లబోయి వెలి మందహాసంతో నవ్వుకుంది. వినయనాగుడు తనకేసి చిరునవ్వుతో తారానికా నాగదత్తులు చూడడం గమనించాడు.

“గున్నమామిడి చెట్టుక్రింద చిన్నదీ

నన్ను మేలమాడి తియ్యంగ నవ్వినాదీ!”

అని పాడినాడు వినయనాగుడు ఏమైతే అయిందని తెగించి. అందరూ గొల్లు మన్నారు.

(8)

ఆ రాత్రి నాగదత్తుడూ, అతని తండ్రీ, వినయనాగుడూ, నాగదత్తుని అన్నగారూ అందరూ కూర్చుండి మాట్లాకుంటున్నారు.

వినయనాగుడు: సంపూర్ణవిద్యావంతులూ, అతిరథులూ అయినా మహారాజుకు నాగదత్తుడు ఆంతరంగికుడయ్యాడు. నేను పల్లెటూరివాడను మామగారూ.

గ్రామాణి (నాగదత్తుని తండ్రి): అవునయ్యా ఎవరు ఈ మహారాజులు, భూమీశులు, భూపతులూను? నువ్వూ భూమీశుడవూ భూపతివే ! అయితే నీకూ భూమికీ సర్వకాల సంబంధం, మహారాజుకూ భూమికీ నీ వ్యాజాన సంబంధం!

వినయ: వారి చదువు?

గ్రామాణి: మహారాజులకు కాకుండా చదువుకున్న వారు వేలకొలది లేరా?

అడివి బాపిరాజు రచనలు - 6

• 200 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)