పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంపి నన్నిక్కడకు రప్పిస్తారా? ఎవరయినా చూస్తే ఏమనుకుంటారు?” అని మొగం తిప్పుకుంది. అతడు ఆమెను క్రిందికి దింపకుండా “నేనా దొంగను?” అన్నాడు. “మీరే!” “కాదు నువ్వే!” ఇద్దరూ పకపక నవ్వుకొన్నారు. ఇదంతా తారానిక నాగదత్తులు వేసిన ఎత్తు అని ఇద్దరూ అనుకొన్నారు. ఈ అదను దొరికిన దేలాగు దొరికింది అని అంతత్రపాపూర్ణ హృదయంగల వినయనాగుడు యశోదను ఒక గున్నమామిడి నీడలోనికి తీసుకొనిపోయి కూర్చుండబెట్టెను. ఆమె ప్రక్కనే అతడధివసించి,

“యశోదా! నేను వట్టిపల్లెటూరివాణ్ణి” అన్నాడు.

“నేనూ అంతే!”

“నువ్వు రాజకుమారికకు చెలికత్తెవు.”

“ఎవరైనా వివాహంకాగానే....” ఆమె సిగ్గుతో కళవిళపడి మందహాసంచేసి తల వాల్చుకుంది. అతడూ నవ్వుతూ “అవును యశోదా! పెళ్ళి అయిన వెనుక అత్తవారింటికి పంపిస్తారన్నమాట నిశ్చయమే. అయితే నువ్వు ఎంత చిన్నతనంనుంచో పట్టణవాసంలో రాచనగళ్ళలో పెరిగిన దానవూ, నువ్వు బాగా చదువుకొన్నావూ, నాగరికతలో మునిగి తేలినదానవు నేను పల్లెటూరి మొరకుమానిసిని నేను నీ కలవపూవు చేతిని ఆశించడం ఆకాశంలోని చంద్రుని కోరటమే!” అని మనవి చేసుకొన్నాడు.

“నేను పల్లెటూరిదాన్ని, మీరు బాగా చదువుకున్నవారు. మీ బోటులు ఎక్కడ ఉన్నా జ్ఞానవంతులే!”

“ఇంతకూ....?”

“మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం.”

“మీ అన్నయ్య మనసారా మన దాంపత్యం కోరుతున్నాడు.”

“అయితే మా అన్నయ్య ఇష్టమే!”

ఎంత సిగ్గుతో కుంగిపోయేవారికైనా ప్రేమ విషయం వచ్చే సమయానికి ఎక్కడి సిగ్గు అక్కడే మాయమౌతుంది. వినయనాగుడు “యశోదా, నేను కృష్ణ ఒడ్డున కూర్చుండి ఆ నీలపులోతులో నీ కళ్ళు చూచేవాడిని!” అని ఆమె వంక తమితోకూడిన చూపులతో చూస్తూ అన్నాడు. యశోద తలవంచి గడ్డి మొక్కలు పీకుతున్నది.

“మా పొలాలగట్ల వసంత ప్రారంభంలో వికసించే మోదుగ పూలల్లో నీ పెదవులు దర్శించాను!”

ఆ బాలిక దీర్ఘవినీల పక్ష్మాల నెత్తి వినయనాగుని చూచి చిరునవ్వు నవ్వుకొని కన్నుల మూసికొన్నది. ఒకసారి తన ప్రియురాలిని ఎత్తుకొని హృదయాని కదుముకొన వినయనాగునికి ధైర్యమూ రసికతా... వానాకాలం నాటి సెలయేళ్ళలా... ఎందుకు పొంగదూ!

“యశోదా! నువ్వు మా రాళ్లరేవుగ్రామంలో ఎలా కాపరం చేయగలవు?”

“కృష్ణాతీరం అద్భుతం, రాళ్లరేవు అందమైన గ్రామం!”

వినయనాగుడు ఒక్కసారిగా యశోదను హృదయానకు హత్తుకొన్నాడు. ఆమె మోమెత్తి ఇటుచూచి, అటుచూచి, మొదట సిగ్గుపడుతూ, ఆ వెనుక ధైర్యంతో ఆమె