పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/206

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సౌందర్యదేవతా

మారూపు వెన్నెలై మాసొబగు తారలై

అమృతకలశము ప్రేమ

ఆనందమై బ్రతుకు

సౌందర్యదేవతా!

సౌందర్యదేవతా

జలజలా ప్రవహించు

సెలయేరు మావిద్య
కలలోని పురుషుడే

నిలుచు మా ఎదుట నే

సౌందర్యదేవతా!”

అని పాడినారు. కంకణాల గలగలలు తాళమై కాళ్ళ మంజీరాల గజ్జెల చప్పుడు మృదంగనాదమై వారి నాట్యానికి హంగు చేసినవి.

ఇంతలో ఒక చిన్న బాలుడు యశోదకొంగులాగి “అత్తా నిన్ను తొందరగా... ఎవరికో జబ్బుచేసిందట.... రమ్మన్నారు” అని చెప్పినాడు. యశోద చకితయై కళవళపడుచు గబగబ ఆ బాలుని వెంట పరుగిడి, నులివెచ్చ ఉదయపు టెండలో పోయినది. ఆతడు ఒక మామిడి తోపులోనికి యశోదను తీసుకువెళ్ళి అక్కడ ఆమెకు కనబడకుండా మాయమైనాడు. యశోద “విజయా! విజయా! ఏడమ్మావాడు? ఈ తోటలోనికివచ్చి ఎక్కడ మాయమయ్యాడు?” అని కేకవేస్తూ ఉండగా అక్కడకు వినయనాగుడు పరుగున వచ్చి “ఏలా ఉంది కాలు నీకు” అంటూ రోజుకుంటూ అడిగినాడు.

“నాకు కాలు ఏలా ఉండడమేమిటి?” అని యశోద భయపడుతూ, సిగ్గుపడుతూ అన్నది.

“నువ్వు పడడం కాలు విరగడం?”

“నేను పడలేదే!”

నేను నమ్మను! నవ్వు నన్ను చూచి సిగ్గుపడుతున్నావు!” అంటూ వినయనాగుడు వంగి ఆమె ముందు మోకరించి “ఎక్కడ కాలు దెబ్బతిన్నది?” అని ప్రశ్నించినాడు.

“నాకు దెబ్బతగులలేదండీ!” అంటూ యశోద పరుగెత్తింది. ఆ అందమైన రూపంతో ఆ ఉదయకాలంలో ఆ బాలిక లేడిలా పరుగెత్తుతూ ఉంటే వినయనాగుడు తెల్లబోయి ఒక్కనిముషం నిలుచుండి తనకోసం ఆ బాలిక వంకబెట్టి అన్న కొమరుని పంపినదని ఊహించుకొని, ఆనందంతో మోము వికసించగా “ఆగు! నీ కాలు విరగడం నిజం! నిజం!” అంటూ వేగంగా పరుగెత్తి యశోదను అందుకొని పువ్వున చేతుల్లోకి ఎత్తుకుని.... “కాలు ఎక్కడ విరిగిందో చూపు దొంగా?” అన్నాడు.

మాయచేసి వినయనాగుడు తన్ను రప్పించుకొన్నాడని యశోద ఆనంద పూర్ణమైకూడా, మాయచేసినందుకు కొంచెం అంటే కొంచమే కోపం తెప్పించుకొని, “మీరే దొంగలు, మా అన్నయ్యగారి చిన్నబ్బాయిని ఎవరికో జబ్బు చేసిందని చెప్పమని

అడివి బాపిరాజు రచనలు - 6
అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)
• 198 •