పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

“తగదోయీ, తగదోయీ ఒగలమారి చిన్నవాడ

నగిపోరా విన్న కన్న నలుగురు ఊరూవాడా?

సెగలు పొగలు చిమ్ముకుంటు

రగిలే చూపులకోపులు

మగవారల ఆగడాలు

పగటివేళ కాగడాలు”తగదోయీ

అతని ధూర్తత నివారించింది. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకొని తనలో తాను మురిసిపోతూ తారానిక కుట్ర ప్రారంభించింది. వినయనాగుడు మెత్తబడి సరేనన్నాడు. వినయనాగుడు ఆగిపోయినాడని యశోదకు తెలిసి సిగ్గూ పడింది, ఆనందమూ చెందింది. తారానికతో “వదినా! మనం ధాన్యకటకం త్వరగా పోవద్దా?” అన్నది. “త్వరగానే వెళ్ళాలి. ఈ రోజు కనుము, రేపు ముక్కనుము ఆ తర్వాత మామయ్యగారు మంచిరోజు చూచి పంపుతారు” అన్నది.

(7)

కనుమునాడు బాలికలందరూ కలిసి సౌందర్యపారమితను పూజించడానికి, బళ్ళు కట్టుకొని కృష్ణ ఒడ్డున "రాళ్ళరేవు"కు తెల్ల వారగట్లనే బయలుదేరినారు. నదీతీరపు ఊళ్ళ నుంచి ఈ పూజకు బాలికలు కృష్ణ ఒడ్డుకు వస్తారు. సెలయేళ్ళకు, నదులకు, చెరువులకు బాలికలు తెల్లవారగట్లనే చేరి స్నానాలుచేసి, చక్కని ఉడుపులు ధరించి, తలలు దువ్వుకొని, కేశసౌభాగ్యం వివిధ రూపాలుగా అలంకరించుకొని నగలు ధరించి పూవులు పత్రాలు ధరించి, పళ్ళను నైవేద్యంగా పట్టుకు వెళ్లుతారు. చుట్టుప్రక్కల అశ్వద్ద వృక్షం ఉంటేసరి. లేకపోతే అశ్వద్ధశాఖను కృష్ణ ఒడ్డునే పాతి చుట్టూ అలికి ముగ్గులు పెట్టి పూజలు చేస్తారు. షోడశోపచారాలు సలిపి, చుట్టూ పాటలు పాడుతూ నాట్యం చేస్తారు. రాళ్ల రేవుకుపోయి కృష్ణలో స్నానం చేసి యశోదా తారానికల ఇతర బాలికలు పూజలు పూర్తిచేసి, పాటలు పాడుతూ నాట్యం చేస్తున్నారు.

“సౌందర్యదేవతా!

అంద వే మాపూజ

మాబ్రతుకులోచేరు

మధురమగు అందాలు

సౌందర్యదేవతా!

సౌందర్యదేవతా

మందారపూవలై నందనోద్యానమై

అమ్లాన సుమములై

అలరు మాబ్రదుకులు

సౌందర్యదేవతా!

అడివి బాపిరాజు రచనలు - 6

• 197 •

అడవి శాంతిశ్రీ (చారిత్రాత్మక నవల)