పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“సాధారణ ప్రజలు ఆచరణలో పెట్టలేని ధర్మాలు కొద్ధిమందికే పనికి వస్తాయి. కాబట్టి సాధారణ ప్రజలు ఆచరించవలసిన ధర్మాలు వేరు. మేధావంతులు ఆచరించవలసిన ధర్మాలు వేరూనా.”

“ధర్మాలు వేరుగా ఉండవు ప్రభూ! ధర్మం ఒక్కటే! ఆచరణలో పెట్టే విధానంలోనే తేడాలుంటాయి. అన్నం తింటే కడుపు నిండి ఆకలితీరి, బలం పట్టుతుందని అందరికీ తెలుసును. కాని అన్నతత్వం ఎటువంటిదీ, అన్నంలో ఉండే ప్రాణశక్తి ఏలా వచ్చిందీ మొదలైన విషయాలు అందరికీ తెలియకపోవచ్చు.”

“అయితే అన్నం వండడం, దానిని తినడం అందరికీ ఒకటేకాదా?”

“ఆ రెండూ అన్నం తినడంలో భాగాలే. కాని కంచంలో, ఆకులో, మట్టిమూకుడులో తినడమనే భేదాలుంటాయి.”

“కాబట్టి?”

“కాబట్టి ఉత్తమ విద్యలు సాధారణ మనుష్యులు అర్థం చేసుకోలేరు.”

“అవి ఆచరణలోనూ పెట్టలేరు.”

“వారి శక్తికి తగినట్లు ఆచరణలో పెట్టుకున్నారు కాదా ప్రభూ! పల్లెటూరి పదాలు, పల్లెటూరి ఇండ్ల అలంకరణలు. కావడి చిందు, గంగా యాత్ర మొదలైన పల్లెటూరి నాట్యాలు లేవా? అవీ అందమైనవే. వాటిలోనూ రసవత్తరఘట్టాలున్నాయి.”

“వారికి విద్య అక్కరలేదని వాదించగలవా?”

“ఏలా వాదించగలను? వారికే ముఖ్యంగా విద్య ఉండాలి. వారి కోసమే రాజ్యాలు. వారికోసమే ధర్మాలు, నీతులు. వారికోసమే గుళ్ళు, గోపురాలు, చైత్యాలు, గుహలు. వారికోసమే వైద్యం ఆచారం!”

“కాబట్టి ప్రజలే భగవంతుడని శాస్త్రాలు చెప్పుతున్నాయి. ఆ ప్రజలకోసం వివాహం ఉద్భవించింది. వివాహం అనే ఉత్తమ సంస్కారం లేకపోతే మనుష్యుడు పశువే!”

“సాధారణ మనుష్యులుకాక కొంచెం జ్ఞానవంతులైనవారు ఆ సంస్కారం మానివెయ్యవచ్చుకాదా గురుదేవా?”

“ఆ! ఎందుకు మానివేయకూడదు? కళ్ళుతెరచి అన్నీ తెలిసి నిప్పులో ఉరికే మనుష్యుణ్ణి అడ్డం పెట్టేవారున్నారా? మనస్సును దేహాన్ని వికలం కాకుండా కాపాడుకోవడం తోటే సరిపోతుంది సన్యాసంలో, ఇంక మార్గాష్టకము ఆచరణలో పెట్టేదెప్పుడు? అందుకని ఆర్షధర్మము సన్యాస ధర్మాన్ని చాలాదూరంగా ఉంచింది.”

శాంతిశ్రీ “గురుదేవా! మనం చాలాసేపు మాట్లాడినాము. ఇంక నేను సెలవు తీసుకుంటాను” అని తలవంచి నమస్కరించి ఆ బాలిక సెలవు పుచ్చుకొన్నది.”

తన గురువు ఈనాడు ఇటువంటి బోధ ఒనర్చినాడేమిటి అనుకుంటూ శాంతిశ్రీ తన అంతఃపురానికి వెళ్ళిపోయింది. అచట పల్యంకాసనంపై మేనువాల్చి లోకాంతాలకు పరువులైతే ఆలోచనలను కూడతీసికొన ప్రయత్నించింది. ఇంతలో యశోదనాగనికా తారానికలు ఆమెకడకు వచ్చినారు. వారిరువురు ఇప్పుడు రాజకుమారికడకు రావడానికి అనుజ్ఞ వీడ అవనరం లేదు. అనుజ్ఞ ఇచ్చే వారే వారు. ఈ ఇరువురు రావడంతోనే

అడివి బాపిరాజు రచనలు - 6

193

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)