పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“మనుష్యునికి ఆనందం ఆ అనుభవంవల్ల వస్తుంది. ఆ అనుభవం వర్తమానం కావచ్చు, వెనుకటి అనుభవం స్మృతీకావచ్చు. ఇతరుల అనుభవ సందర్శనంవల్లగాని ఇతరులు ఆనందంవల్లగాని తమలో విజృంభించే ఆనందాన్ని ఉపయోగించి లలితవిద్యను ఉద్భవింపచేస్తే వానిని దర్శించడంవల్ల ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం ఉత్తమరూపమైనప్పుడు అది మనలోని కల్మషాలను కడిగివేస్తుంది. మనుష్యుడు నిర్మలుడై కళాసృజనవల్ల సంగీతాది విద్యలను ఉత్తమ స్వరూపాలనుగా చేస్తాడు. ఆనంద కారణం ఉత్తమమయితే దాని ఛాయలు సంగీత, శిల్ప, కావ్యాదివిద్యలోనూ ఉంటాయి. అందువల్లనే అవి చతుర్విధ పురుషార్ధ సాధనాలు అవుతాయి.”

“మనుష్యుడు తుచ్ఛభావాత్మకంగా ఈ కళలను సృష్టిస్తే అవి ఆనంద మీయవు అంటారా గురుదేవా?”

“రాజకుమారి!దైహికమైన తృప్తిని సూచించే ఆనందం ఉత్తమానందం కాదు. అంటే మన భోజనాన్ని గూర్చిన కవిత్వం ఉత్తమంకాదు.”

మీరు చెప్పినది అవగాహన అయింది. తమకు నా పాట ఒకటి వినిపించాలని కొన్ని దినాలనుండి వాంఛిస్తూ, లజ్జచేత ఊరుకొన్నాను.”

“నీకు లజ్జ ఏమిటి రాజకుమారీ! ఏవయినా లోట్లు ఉంటే నేను పరిష్కరింప ప్రయత్నింపవచ్చుగదా?”

“వినండి,”

ఆ బాలిక మోము త్రపచే అరుణమైనది. ఆ దివ్యసుందరి మోము చూచి బ్రహ్మదత్తుని హృదయము ఆర్ధ్రతవహించి కొట్టుకోజొచ్చినది. శాంతిశ్రీ తలవంచుకొనే, అతిమధురమైన కలకంఠంతో తోడిరాగణి ఆలపించింది. తోడిరాగణీ విరహాన్ని సూచిస్తుంది. ఆ రాగిణీదేవి విపంచి మీటుతూ, తన్నను సరించే పెంపుడులేడి తన కళ్ళలోకి దీనంగా చూస్తూ ఉండగా రమణీయ ప్రదేశంలో విరహాసనాసీనయై ఉంటుంది.

“మేఘమా ఎచటికే

మెరుములీనుచు యాత్ర

విద్యుల్లతాంగి నీ

వెలుగు లెవ్వరికొరకు?”

ఆమె కంఠము రుద్ధమైపోయినది. ఆమె కన్నులవెంట రెండు అమృత బిందువులు రాలినవి.

(4)

బ్రహ్మదత్తుడు శాంతిశ్రీ వైపు చూడకుండా ఏదో గ్రంథము చూస్తున్నట్లు నటించి “లలితవిద్యలు సాధారణప్రజలకు అర్ధం కావాలా వద్దా?” అని ప్రశ్నించినాడు.

“సాధారణ ప్రజలకు అన్నీ అర్థం కాగలవా? ధర్మసూక్ష్మాల వంటివి అందరికి ఏలా అర్థం అవుతవి?”

అడివి బాపిరాజు రచనలు - 6

192

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)