పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

“చిత్తం.”

“అలా యజ్ఞపశువును చెయ్యడంలో హింస ఉండదని వారి మతం”

“యాగానికి చేసినా, భుక్తికోసం చేసినా హింస హింసే అవుతుంది గాని అహింస ఎలా అవుతుంది?”

“యజ్ఞకర్తలు పశువును ప్రాపంచిక వాంఛలకు ప్రతీకగా ఎంచి, దానిని హింసిస్తారు. అంతే.”

“మీరు ఎంత చెప్పినా నా హృదయంలోని అనుమానం పోవడం లేదు,

“ఆ వాదం అలా ఉంచు, అది ఉపమానం కోసం తీసుకువచ్చాను. యాగంలోని హింస ఎటువంటిదో, కళాప్రదర్శనమూ ఆలాంటిదే.”

“విపులం చేయరూ?”

“నాట్యాదులు ఆనందంకోసం ఉద్భవించాయి."

“ఏలాగు?”

“చిన్నబిడ్డల గంతులు, ఆనందంవల్ల వచ్చాయి. ఆ గంతుల్లోనుండి నాట్యం ఆవిర్భవించింది. జగల్లీల ఒక మహాదివ్యనాట్యం. భగవంతుడే ఆ మహానటుడు. ఆనందం సుందరమైన కదలికవల్ల వ్యక్తమవుతుంది. అట్టి కదలికే నాట్య ప్రారంభం.”

“ఆనందము తుచ్ఛమూ ఉత్తమమూ కూడా కావచ్చుకదా అంది?”

“అవును. కాబట్టే మనుష్యుడు ఉత్తమానందం కోరాలి. ఉత్తమానందమే మనుష్యునికి ముక్తిమార్గము. నీచానందము అధఃపతనానికి కారణం. కాబట్టి ఉత్తమానంద రూపమైన విద్యలు ఉత్తమ విద్యలు. ఈ ఉత్తమ విద్యలను మార్గంచేసుకొని ముందుకు పోయేవాడు మోక్షం పొందగలడు. సర్వజీవితమూ ఈ ఉత్తమానంద భావంలో నింపి కర్మ ఆచరించేవాడే తపస్వి.”

(3)

“సంగీతం పాడేవారు, నాట్యం చేసేవారూ కూడా తపస్వులేనా ప్రభూ?”

“అవును శాంతిశ్రీ! రసోన్ముఖులైన స్త్రీపురుషులలో హృదయార్ధ్రత సంపూర్ణంగా ఉంటుంది. ఆర్ద్రహృదయం నిర్మలంగా ఉంటుంది. కాని మనస్సు అతి చంచలమైనది. కాబట్టి ఏమాత్రం నిగ్రహం లేకపోయినా పతనం కలుగుతుంది.”

“అలాంటి విద్యను ఉపాసించకపోవడమే ఉచితం కదా?”

“అదే తప్పుభావం. ధర్మములన్నీ ఆనందజనీతములే, సత్యము, అహింస బ్రహ్మచర్యము, యోగము ఇవన్నీ. వీని కన్నిటికి నిగ్రహం అవసరమే. ఏమాత్రం అజాగ్రత్త ఉన్నా నిముషంలో పతనం కలుగుతుంది. అందుకని అవి మానుతామా?”

“చిత్తం."

"కాబట్టి మానవ కర్మలలో ఉత్తమోత్తములైన ఈ కర్మలు చతుర్విధ పురుషార్థాలకూ ఉపయోగిస్తున్నాము.

“ఆనందమాత్ర ప్రయోజనమైన విద్యలు చతుర్విధ పురుషార్థాలకూ ఏలా ఉపయోగించగలము ప్రభూ?”

అడివి బాపిరాజు రచనలు - 6

191

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)