పుట:Amsumathi by Adavi Bapuraju.pdf/197

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఈ దక్షిణాపథాల సంతరించినకాలం ముందునుంచీ ఈ భూమిలో ఉన్న ముఖ్యమైనదీ పవిత్రమైనది ధర్మం ఒకటి తమతో మనవి చేసుకుంటున్నాను. దేశం ప్రజలది; ప్రజలేదేశం. ఉత్తముడు, పవిత్రజీవి, వేదవేదాంగ సంపన్నుడు ధర్మం నాలుగు పాదాలా నడపగల అతిరథుడు బ్రహ్మర్షి సమానుడైన పురుషుణ్ణి ఆద్యసభలు రాజుగా ఎన్నుకోనేవి. రాజు భూమి రక్షణార్థం, ప్రజారక్షణార్థం ధర్మపాలనార్థం, దుష్టశిక్షణార్ధం. ఆలాంటి భూమీశుడు దేశంలో ధర్మమూ శాంతీ నెలకొల్పి ప్రజలను రక్షిస్తున్నందుకు మాకు వచ్చిన రాబడిలో ఆరోభాగం ఇస్తూ ఉంటిమి, ఇన్ని యుగాలు, ఇదంతా ప్రభువులకు మనవి ఎందుకు చేస్తున్నానంటే ఈ మహావిషమ స్థితిలో దేశదేశాలప్రజలు తమ పవిత్రకర్తవ్యము ఊహించి తమ ధర్మం నిర్వర్తించడానికి శాంతిమూలమహారాజు కడకు వేంచేశారు” అని కొంత విశ్రాంతి తీసుకొనడానికా అన్నట్లు ఆగినాడు. శాంతిమూలునికి బ్రహ్మదత్తునికి తక్కిన ప్రభువులకూ ఆ శతవృద్దు చెప్పబోయే మాటలు తెలుసును. అయినా బ్రహ్మదత్తుడు ఆ వృద్దుని వంక మందహాసంతో చూస్తూ.

“తాతగారూ! తామంతా నిర్వహించబోయే ఆ ధర్మం ఏమిటి? శ్రీరామచంద్రుడు ప్రజాభిప్రాయాన్ని తలదాల్చినట్లు శ్రీ శాంతిమూల మహారాజులున్నూ తమ అభిప్రాయాన్ని పరిపాలిస్తారు” అని తలవంచి, చేతులు జోడించి ప్రజలందరివైపు తిరిగి నెమ్మదిగా తెలిపినాడు. అక్కడి పెద్దలందరూ జయజయధ్వానాలు చేసినారు. అది విని ఆ అఖండ ప్రజాసమూహం అంతా జయజయధ్వానాలు చేసింది. ఆ జయధ్వానదుంధుభి లోకాలు నిండిపోయినది -

ఆ వృద్దుడు “స్వామీ, ధనకప్రభూ! తాము సెలవిచ్చినది ఎంతయినా సమంజసము. మా హృదయం తమ అందరికి మనవి చేసుకుంటున్నాను. శాతవాహనవంశం ధర్మం నాలుగుపాదాలా నడిపిస్తూ రాజ్యం చేసింది. ఆంధ్ర విష్ణువు వంశం నేటివరకు ఒక్క మహాప్రవాహంలాగా ప్రవహించి వచ్చింది. నేటికి మా దురదృష్టంవల్ల ఆ వంశంలో ఎవ్వరూ రాజగుటకు తగినవారు కనపడలేదు. మాకు శ్రీయజ్ఞశ్రీ సార్వభౌముని తర్వాత వారి పుత్రులు వారి మనుమలు నామమాత్ర సార్వభౌములు అయినారు. దేశం నిండా కుట్రలు, ధర్మక్షతి ప్రబలినవి. ధర్మం సాక్షిగా శ్రీరామచంద్రుని సాక్షిగా తథాగతుని సాక్షిగా శ్రీ శాంతిమూల సార్వభౌముడు ఈ జంబూద్వీపానికి చక్రవర్తి కావాలి. “జయశ్రీ శాంతిమూల సార్వభౌమా జయ! విజయీభవ!” అని ఆ వృద్ధుడు వణికిపోతూ కేక వేసినాడు. ఆ ప్రజాసమూహం ఐక్యకంఠంతో భగవంతుని వాక్కుగా జయ జయ ధ్వానాలు సలిపింది.

(2)

శాంతిమూలునికి కొమరిత మాటలు వింటూంటే ఆశ్చర్యం అంతంతకు అధికం కాజొచ్చింది. కొమరిత తెచ్చిన రహస్య వార్తలమాట అలా ఉంచి, ఆమెలో కలిగిన ఈ మార్పు, వ్యవహారం పట్ల ఆమె శ్రద్ద పరమాద్భుతమై కనిపించింది. అన్నిటియందు విజ్ఞానంతో సంచరిస్తోంది. అదీకాక ఈ బాలిక ద్వారా వచ్చిన వార్తలు అపసర్పగణ నాయకులు తెచ్చిన వార్తలకన్న స్పష్టంగాను, అధికంగాను ఉన్నాయి.

అడివి బాపిరాజు రచనలు - 6

189

అడవి శాంతిశ్రీ(చారిత్రాత్మక నవల)